బీజింగ్, సెప్టెంబర్ 10: చైనాలో వైద్య విద్యను అభ్యసించాలనుకొంటున్న భారత విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. ఆ దేశంలో విదేశీ విద్యార్థులు అనుసరించాల్సిన కఠిన నిబంధనలు, తగ్గుతున్న ఉత్తీర్ణత శాతం, భాషకు సంబంధించిన సమస్యల గురించి హెచ్చరిస్తూ సమగ్ర అడ్వైజరీని జారీ చేసింది. కరోనా సమయంలో చైనా విధించిన కఠిన ఆంక్షల కారణంగా ఆ దేశం నుంచి తిరిగొచ్చిన వేలమంది భారత విద్యార్థులు గత రెండేండ్ల నుంచి స్వదేశంలోనే చిక్కుకుపోయారు.
వీరి సంఖ్య 23 వేలకు పైమాటే. ఇందులో ఎక్కువ మంది వైద్య విద్యార్థులే. వీరిలో కొందరి వీసాలను పునరుద్ధరించే ప్రక్రియను చైనా ఇటీవల ప్రారంభించింది. కానీ, ప్రస్తుతం చైనాకు నేరుగా విమానాలు లేకపోవడంతో భారత విద్యార్థులకు సమస్యలు తప్పడం లేదు. మరోవైపు భారత్ సహా విదేశాల నుంచి వచ్చే కొత్త విద్యార్థులకు చైనాలోని మెడికల్ కాలేజీలు అడ్మిషన్లను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం భారత విద్యార్థులకు అడ్వైజరీని జారీ చేసింది. చైనాలో భారత విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులను ఆ అడ్వైజరీలో ప్రధానంగా ప్రస్తావిస్తూ పలు సూచనలు చేసింది.
చైనాలో వైద్య విద్య పూర్తిచేసిన విద్యార్థులు భారత్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ (ఎఫ్ఎంజీ) పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. చైనాలో 2015 నుంచి 2021 మధ్య కాలంలో క్లినికల్ మెడిసిన్ ప్రోగ్రామ్‌ను అభ్యసించిన విద్యార్థుల్లో 40,417 మంది ఎఫ్ఎంజీ పరీక్షకు హాజరవగా 16% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దీన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి.