వాషింగ్టన్: ఒక వాహనం సుడిగాలిలో చిక్కుకున్నది. ఒక వైపున పడి పలు రౌండ్లు తిరిగింది. అయినప్పటికి తిరిగి సాధారణ స్థితికి చేరింది. దీంతో అందులోని డ్రైవర్ ఎంచక్కా ఆ వాహనాన్ని నడుపుకుంటా వెళ్లిపోయాడు. ఆశ్చర్యగొలిపే ఈ సంఘటన అమెరికాలోని టెక్సాస్‌లో జరిగింది. ఇటీవల ఎల్గిన్ హైవే మీదుగా సుడిగాలి వెళ్లింది. ఎరుపు రంగులో ఉన్న 2004 చేవ్రొలెట్ సిల్వరాడో 1500 క్యాబ్ ట్రక్ అందులో చిక్కుకున్నది. సుడిగాలి ధాటికి ఒకవైపు పడిన అది పలు మార్లు తిరిగింది. అయితే అందులోని డ్రైవర్ ఇంజిన్‌ను ఆన్‌లోనే ఉంచారు. మరోవైపు సుడిగాలి దాటే సమయంలో ఊహించని విధంగా ఆ వాహనం తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. దీంతో బతుకుజీవుడా అనుకున్న డ్రైవర్ ఆ వాహనాన్ని నడుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కాగా, సుడిగాలిని తన మొబైల్లో రికార్డు చేస్తున్న మరో వాహనంలోని బ్రియాన్ ఎంఫింగర్ దీనిని చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సుడిగాలిలో చిక్కుకుని ఒకవైపు పడిన వాహనంలోని వ్యక్తి అనంతరం దానిని డ్రైవ్ చేస్తూ వెళ్లిన సంఘటన తనకు ఎంతో ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంగళవారం పోస్ట్ చేసిన 30 సెకండ్ల నిడివి ఉన్న వీడియోను ఇప్పటి వరకు 60 లక్షల మంది వీక్షించారు. నెటిజన్లు కూడా ఈ వీడియోపై నోరెళ్లబెట్టారు. సుడిగాలిలో చిక్కుకున్న వాహనంలోని డ్రైవర్ అదృష్టవంతుడని వ్యాఖ్యానించారు.
Omg… just going thru my video. This is a story about a red truck and a tornado…. I CANNOT believe they drove away like that. #txwx #tornado pic.twitter.com/8h0nD88xFv
— Brian Emfinger (@brianemfinger) March 22, 2022