వాషింగ్టన్: టెస్లా కారు ఆటో పైలట్లో ఉండగా ముందు సీటులో కూర్చొన్న మహిళ అక్కడే ప్రసవించింది. దీంతో ప్రపంచంలో మొట్టమొదటి టెస్లా బేబీగా ఆ చిన్నారి గుర్తింపు పొందింది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఈ ఘటన జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9న, 33 ఏండ్ల యెరాన్ షెర్రీ, ఆమె భర్త 34 ఏండ్ల కీటింగ్ షెర్రీ కలిసి తమ మూడేళ్ల కొడుకును ఎలక్ట్రానిక్ టెస్లా కారులో ప్రీ-స్కూల్కు తీసుకెళ్తున్నారు. అయితే ఆ కారు ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంది.
మరోవైపు నిండు గర్భిణీ అయిన యెరాన్కు నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమె భర్త కారును ఆటో పైలట్ మోడ్లో ఉంచడంతోపాటు డిస్టినేషన్ ఆసుపత్రిగా మార్చారు. అనంతరం ప్రసవ వేదన పడుతున్న భార్యకు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించారు. ట్రాఫిక్ వల్ల కారు మెల్లగా కదులుతుండటంతో ఎంత సమయానికి ఆసుపత్రికి చేరుతుందో అన్నది పదే పదే పరిశీలించారు.
కాగా, ఆసుపత్రికి చేరే 20 నిమిషాల సమయం చాలా కష్టంగా గడిచిందని కీటింగ్ షెర్రీ తెలిపారు. కారు ఆసుపత్రికి చేరేంతలోనే ముందు సీటులో కూర్చొన్న యెరాన్ అక్కడే పాపకు జన్మనిచ్చినట్లు చెప్పారు. నర్సులు బొడ్డు తాడును కూడా కారులోనే కట్ చేశారని ఫిలడెల్ఫియా ఎంక్వైరర్కు వెల్లడించారు.
మరోవైపు, చిన్నారి మేవ్ లిల్లీ గత రెండు నెలలుగా ప్రతి రోజూ తమను ఆనందంలో ముంచెత్తుతున్నదని కీటింగ్ షెర్రీ తెలిపారు. టెస్లా బేబీగా నర్సులు పదే పదే అనడంతో తమ పాపకు టెస్గా నామకరణం చేయాలని ఒకానొక సందర్భంలో అనుకున్నామని అన్నారు.