e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home అంతర్జాతీయం అంతరిక్షంలోకి తెలుగమ్మాయి

అంతరిక్షంలోకి తెలుగమ్మాయి

  • 11న రోదసి పర్యటనకు బండ్ల శిరీష
  • వర్జిన్‌ గెలాక్టిక్‌ స్పేస్‌ ఫ్లైట్‌లో అంతరిక్షయానం
  • సంస్థ అధిపతి బ్రాన్సన్‌, మరో ఇద్దరు కూడా..

హైదరాబాద్‌, జూలై 2: తెలుగు మూలాలు ఉన్న అమెరికా యువతి బండ్ల శిరీష అంతరిక్ష పర్యటనకు వెళ్లనున్నారు. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం ఈ నెల 11న అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ స్పేస్‌ ఫ్లైట్‌ను పంపిస్తున్నది. ఇందులో సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌, సంస్థ లీడ్‌ ఆపరేషన్స్‌ ఇంజనీర్‌ కాలిన్‌ బెన్నెట్‌, కంపెనీ చీఫ్‌ ఆస్ట్రోనాట్‌ సలహాదారు బెత్‌ మోసెస్‌, శిరీష వెళ్తున్నారు. బృందంలో ఇద్దరు పైలట్లు కూడా ఉంటారు. తెలుగు మూలాలున్న ఓ మహిళ అంతరిక్ష యాత్ర చేయడం ఇదే తొలిసారి. గతంలో భారత్‌కు చెందిన కల్పనా చావ్లా, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌ అంతరిక్షంలోకి వెళ్లారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ మానవ సహిత అంతరిక్ష యాత్ర నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో మూడు సార్లు మనుషుల్లేకుండా ప్రయోగాలు నిర్వహించింది. అంతరిక్షంలోకి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఈ కంపెనీకి జూన్‌ 25న ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ లైసెన్సు జారీచేసింది.

ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ
శిరీష ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించారు. హ్యూస్టన్‌, టెక్సాస్‌లో పెరిగారు. అంతరిక్షంపై ఆసక్తితో పర్‌డ్యూ వర్సిటీ నుంచి ఏరోనాటికల్‌-ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. వాషింగ్టన్‌ వర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు. ప్రస్తుతం ఆమె వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ ప్రభుత్వ వ్యవహారాల విభాగం ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

- Advertisement -

బెజోస్‌కు పోటీగా..
అంతరిక్ష పర్యాటకంపై ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థల ప్రతినిధులు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. స్పేస్‌ ఎక్స్‌ సంస్థ అధిపతి ఎలాన్‌ మస్క్‌ అంతరిక్షానికి షటిల్‌ సర్వీసులు(పర్యాటకులను తీసుకువెళ్లి తీసుకువస్తామని ప్రకటించారు) నడుపుతామని ప్రకటించడం, తర్వాత అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ ఇదే తరహా ప్రయోగాలు చేయడంతో స్పేస్‌ యాత్రలపై పోటీ పెరిగింది. ఈ నెల 20న అంతరిక్షంలోకి వెళ్లనున్నట్టు బెజోస్‌ ప్రకటించారు. ఆయనకు పోటీగా, ఆయన కంటే ముందుగా అంతరిక్ష యాత్ర చేయాలన్న ఉద్దేశంతో వర్జిన్‌ గెలాక్టిక్‌ ఈ యాత్ర నిర్వహిస్తున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana