లండన్: తన ఖరీదైన వోడ్కాను తాగిన స్నేహితురాలిని ఒక యువతి కొట్టి బెదిరించడంతోపాటు బంధించింది. బ్రిటన్లో ఈ ఘటన జరిగింది. క్లారిటీ కెన్నెడీ ఇటీవల తన 18వ పుట్టిన రోజును స్నేహితులతో కలిసి జరుపుకున్నది. తాగిన మైకంలో నిద్రించిన ఆమె మరునాడు ఉదయం లేచింది. ఆమె స్నేహితురాలు లారా క్రీడాన్కు కూడా అప్పుడే మత్తు దిగింది.
అయితే తన ఖరీదైన (రూ.8,000 విలువైన) వోడ్కాను లారా తాగిందని కెన్నెడీ ఆరోపించింది. దీనికి డబ్బులు చెల్లించాలని ఆమెను డిమాండ్ చేసింది. లారా నిరాకరించగా ఆమెను ఖాళీ బాటిల్తో కెన్నెడీ కొట్టింది. అనంతరం పొడుస్తానని కత్తితో బెదిరించడంతోపాటు లారాను తన ఫ్లాట్లో బంధించింది.
కాగా, బర్త్ డే వేడుకలో పాల్గొన్న మరొకరి సహయంతో లారా అక్కడి నుంచి బయటపడింది. అనంతరం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కిడ్నాప్ ఆరోపణలపై కెన్నెడీని అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచారు. సోమవారం విచారణ జరిపిన వార్విక్ క్రౌన్ కోర్టు ఆ యువతికి 14 నెలల నిర్బంధం, 60 గంటలు జీతం లేని పని చేయాలని ఆదేశించింది.