వియన్నా: భద్రతా కారణాల దృష్ట్యా.. వియన్నాలో జరగాల్సిన టేలర్ స్విఫ్ట్(Taylor Swift) మ్యూజిక్ కచేరీలను రద్దు చేశారు. ఈరాస్ టూర్లో భాగంగా ఆ కన్సర్ట్లు జరగాల్సి ఉంది. ఎర్నస్ట్ హప్పెల్ స్టేడియంలో గురు, శుక్ర, శనివారాల్లో ఆ షోలు జరగాల్సి ఉంది. ఆస్ట్రియా రాజధానిలో ఇస్లామిక్ స్టేట్ గ్రూపుకు చెందిన అనుమానితులు అటాక్‌కు ప్లాన్ చేసినట్లు తేలింది. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దర్ని అరెస్టు చేశారు. నిర్వాహకులు దీనిపై ప్రకటన జారీ చేశారు. స్టేడియంలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారని, తమకు ఎటువంటి అవకాశం లేదని, అందుకే మూడు షోలను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 10 రోజుల్లో ఆటోమెటిక్‌గా టికెట్ డబ్బులను రిఫండ్ చేయనున్నట్లు చెప్పారు. 19 ఏళ్ల ఆస్ట్రియా పౌరుడిని టెర్నిజ్లో అదుపులోకి తీసుకున్నారు. వియన్నాలో మరొకర్ని అరెస్టు చేశారు.