Syria violence : సిరియా (Syria) లో మళ్లీ హింస చెలరేగింది. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ (Bashar al-Assad) మద్దతుదారుల తిరుగుబాటుతో స్థానికంగా మరోసారి హింస చోటుచేసుకుంది. భద్రతా దళాలు (Security force), అసద్ సపోర్టర్స్ (Assad suporters) మధ్య జరిగిన ఘర్షణల్లో వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సిరియా అంతర్యుద్ధం మొదలైన తర్వాత అత్యంత ఘోరమైన ఘటనగా ఈ హింసను పేర్కొంటున్నారు.
తాజా ఘర్షణలకు సంబంధించిన వివరాలను బ్రిటన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. అసద్ మద్దతుదారులు తొలుత ప్రభుత్వ భద్రతా దళాలపై దాడులకు పాల్పడ్డారు. దాంతో భద్రతా దళాలు ప్రతిదాడికి దిగాయి. ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో వెయ్యి మందికిపైగా మృతిచెందారు. వారిలో 745 మంది సాధారణ పౌరులు కాగా.. మరో 125 మంది భద్రతా సిబ్బంది, 148 మంది అసద్ మద్దతుదారులు ఉన్నారు.
తిరుగుబాటుదారులు ఇటీవల మెరుపు వేగంతో సిరియా (Syria) ను ఆక్రమించారు. దాంతో అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు పారిపోయారు. రెబల్స్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ గురువారం అసద్ మద్దతుదారులు జబ్లే నగరంలో భద్రతా దళాలపై దాడిచేసి చంపారు. దాంతో అసద్ సపోర్టర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లోకి ప్రవేశించిన ప్రభుత్వ దళాలు పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో వారి ఇళ్లకు నిప్పంటిచడంతో ఘర్షణలు పెద్దవయ్యాయి.
బనియాస్ పట్టణంలో జరిగిన ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలు వీధుల్లో, ఇళ్లలో పడి ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. వాటిని తీసుకునేందుకు కూడా ఎవ్వరూ సాహసం చేయడం లేదని తెలిపారు.