కాఠ్మండు: నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా జస్టిస్ సుశీల కర్కి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రమాణం చేయించారు. నేపాల్ పీఎం పదవిని చేపట్టిన తొలి మహిళగా సుశీల నిలిచారు. దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఆమె రికార్డు సృష్టించారు. నేపాల్ రాష్ట్రపతి భవన్లో రాత్రి 9.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కొద్ది మంది మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటుచేసిన కర్కి.. వెంటనే వారితో క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. 2026 మార్చి 4న ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించాలని కూడా కర్కి ప్రతిపాదించినట్టు సమాచారం. క్యాబినెట్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత, దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అమల్లోకి రానున్నది. అంతకుముందు జెన్ జెడ్ ప్రతినిధుల బృందం కర్కి నాయకత్వానికి అంగీకారం తెలిపింది. అయితే పార్లమెంట్‌ను రద్దు చేయాలని షరతు విధించింది. కాగా, ప్రమాణ స్వీకారానికి ఉభయ సభల అధిపతులు హాజరుకాలేదు.
సుశీల కర్కి దేశంలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నేపాల్ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 2016లో అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు సుశీల కర్కీని అప్పటి అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఉపాధ్యాయురాలిగా తన వృత్తిపర జీవితాన్ని ప్రారంభించిన కర్కీ అనంతరం న్యాయవ్యవస్థలోకి ప్రవేశించారు. నిర్భయంగా, సమర్థంగా, అవినీతి రహితంగా ఆమె తన బాధ్యతలు నిర్వర్తించి ప్రజల మన్ననలు అందుకున్నారు. ఆమె బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశారు. త్రిభువన్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2009 జనవరి 22న నియమితులయ్యారు. 2016 ఏప్రిల్ 13న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016 జూలైలో నేపాల్ ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 మే నెల వరకు ఈ పదవిలో కొనసాగారు. పదవీ విరమణ తేదీకి 40 రోజుల ముందు అభిశంసనకు గురయ్యారు. నేపాల్‌లో అభిశంసనకు గురైన మొదటి ప్రధాన న్యాయమూర్తి ఆమె. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఇదిలావుండగా, ఈ తాత్కాలిక ప్రభుత్వం ఆరు నెలల్లోగా ప్రతినిధుల సభకు ఎన్నికలను నిర్వహిస్తుంది.
ఘజియాబాద్ నుంచి నేపాల్‌లోని పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వెళ్లిన దంపతుల జీవితాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ దంపతులు కాఠ్మాండులోని పశుపతినాధుని దేవాలయానికి వెళ్లడం కోసం ఈ నెల 7న బయల్దేరారు. ఈ నెల 9న వారు బస చేసిన ఫైవ్ స్టార్ హోటల్‌ను నిరసనకారులు తగులబెట్టారు. వీరిద్దరూ ఓ కిటికీ గుండా బయటకు రావడానికి ప్రయత్నించారు. కానీ పొగ, మంటలు వ్యాపించడంతో తప్పించుకోలేకపోయారు. సహాయక బృందాలు కింద చాపలను పరచి, హోటల్ భవనం నుంచి కిందికి దూకేయాలని చెప్పారు. రామ్‌వీర్, రాజేశ్ దేవి నాలుగో అంతస్థు నుంచి దూకేశారు. రాజేశ్ దేవి తీవ్రమైన వెన్నెముక గాయాలతో చికిత్స పొందుతూ ఈ నెల 10న తుది శ్వాస విడిచారు. మరోవైపు కాఠ్మాండు నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న ఇండియన్ టూరిస్ట్ బస్సుపై నిరసనకారులు దాడి చేశారు. ఈ నెల 9న జరిగిన ఈ దాడిలో పలువురు గాయపడినట్లు బస్సు డ్రైవర్ చెప్పారు. పశుపతినాథ్ గుడికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.