Friendship | న్యూయార్క్, మే 26: మనుషులు తరచుగా ఒకరికొకరు సహకరించుకోవడం సాధారణమే. బంధుత్వం, పరస్పర సంబంధం లేకున్నా ఈ సహకారం కనిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి సహకారం జంతువుల మధ్య కూడా ఉంటుందని నిరూపించడం చాలా కష్టం. కానీ, మనుషుల మాదిరిగా కొన్ని రకాల పక్షులు సైతం పరస్పరం సహకరించుకుంటాయని తాజా అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో భాగంగా ప్రొఫెసర్ డస్టిన్ రుబెన్స్టెయిన్ ల్యాబ్ మాజీ పీహెచ్డీ విద్యార్థి అలెక్సిస్ ఎర్ల్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఏకంగా 20 ఏండ్లపాటు ఆఫ్రికన్ స్టార్లింగ్ పక్షుల తీరును పరిశీలించింది.
మానవుల మాదిరిగానే ఆ పక్షులు కూడా ఒకదానికొకటి సహకరించుకుంటాయని, సాటి పక్షికి సాయపడితే దాని నుంచి భవిష్యత్తులో తనకూ సాయం అందుతుందన్న అవగాహనతో ఆఫ్రికన్ స్టార్లింగ్స్ మధ్య పరస్పర సహకారం కొనసాగుతుందని ఈ పరిశీలనలో తేలింది. స్టార్లింగ్ సమూహాలు కేవలం సాధారణ కుటుంబాలు మాత్రమే కాదని, అవి చాలా సంక్లిష్టమైనవని, వాటి మధ్య సంబంధం ఉన్నా, లేకున్నా మనుషుల మాదిరిగా దీర్ఘకాల మైత్రితో కలిసే జీవిస్తూ పరస్పరం సహకరించుకుంటాయని రుబెన్స్టెయిన్ వివరించారు.