శనివారం 04 ఏప్రిల్ 2020
International - Mar 18, 2020 , 02:46:08

ప్రపంచం దిగ్బంధం

ప్రపంచం దిగ్బంధం

న్యూయార్క్‌: కరోనా రక్కసిని కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలు విధిస్తున్న ఆంక్షలతో ప్రపంచం యావత్తూ దిగ్బంధానికి గురైనది. సరిహద్దుల మూత, ప్రయాణాలపై నిషేధం విధిస్తుండడంతో స్వస్థలాలకు వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆగ్నేయాసియా మొదలుకుని, యూరప్‌, అమెరికా వరకు ఇదే పరిస్థితి నెలకొన్నది. మలేసియాలో నిత్యావసరాల కోసం సూపర్‌మార్కెట్ల ఎదుట ప్రజలు బారులు తీరారు. ఫిలిప్పీన్స్‌లో చెక్‌పాయింట్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. స్పెయిన్‌లో మంగళవారం ఒక్కరోజే రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 11,178కి చేరుకోగా, మృతుల సంఖ్య 491కి పెరిగింది. డిమాండ్‌ తగ్గడం, ప్రయాణాలపై నిషేధం నేపథ్యంలో విమానాయాన సంస్థలు సర్వీసులను భారీగా తగ్గించాయి. 9 యూరప్‌ దేశాల్లో చిక్కుకుపోయిన తమ దేశానికి చెందిన 3,614 మందిని తరలించేందుకు టర్కీ సిద్ధమైంది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా చిక్కుకుపోయిన తమ దేశీయులను తరలించేందుకు జర్మనీ 50 మిలియన్‌ యూరోల వ్యయంతో కార్యాచరణ రూపొందించింది. ఒక్క మొరాకోలోనే 5,000 మంది జర్మన్లు చిక్కుకుపోయినట్లు అంచనా. విదేశీయులకు పోలండ్‌ సరిహద్దులు మూసివేయడంతో ఆ దేశంలోకి వెళ్లాల్సిన ట్రక్కులతో లిథువేనియాలో 60 కి.మీ. మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఇటలీలో కరోనా బాధితుల సంఖ్య 27,980కి చేరుకున్నది. ఇప్పటివరకు ఆ దేశంలో 2,158 మంది మృత్యువాతపడ్డారు. 

  •  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 7,950 మందికిపైగా మృత్యువాత పడగా, దాదాపు 1,97,000 మంది వైరస్‌ బారినపడ్డారు. 
  •  కరోనా తొలిసారి వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహాన్‌లో మంగళవారం ఒక కేసు మాత్రమే నమోదైంది. 
  •  కరోనా నేపథ్యంలో థాయ్‌లాండ్‌ వాటర్‌ ఫెస్టివల్‌ను రద్దుచేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి యూఎస్‌ గుర్రపు పోటీలు వాయిదా పడనున్నట్లు సమాచారం. 


logo