టెక్సాస్, అక్టోబర్ 13: అంతరిక్ష పరిశోధనలలో మరో నూతన ప్రయోగం విజయవంతంగా ఆవిష్కృతమైంది. ఎలాన్ మస్క్ అధిపతిగా ఉన్న స్పేస్ ఎక్స్ చేపట్టిన ‘స్టార్‌షిప్’ ఐదో ప్రయోగం విజయవంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం టెక్సాస్ దక్షిణ తీరం నుంచి దీనిని ప్రయోగించారు. భారీ రాకెట్ ప్రయోగించగా అందులో రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసింది. అందులో మొదటి దశలో భాగంగా 121 మీటర్ల పొడవైన భారీ రాకెట్‌ను ప్రయోగించిన కొద్ది సేపటికే 71 మీటర్ల పొడవైన భారీ బూస్టర్ తిరిగి ల్యాంచ్పాడ్కు చేరి అందులో ఒదిగి కూర్చుంది.
రెండో దశలో భాగంగా స్పేస్‌క్రాఫ్ట్ తన ప్రయోగాన్ని కొనసాగించి హిందూ మహాసముద్రంలో విజయవంతంగా దిగింది. చంద్రుడు, అంగారకుడిపై యాత్రలకు వీలుగా స్పేస్ ఎక్స్ వీటిని రూపొందించింది. ఈ ప్రయోగం ద్వారా తమ రెండు లక్ష్యాలు నెరవేరినట్టు స్పేస్ ఎక్స్ తెలిపింది. ప్రయోగం విజయవంతం కావడంతో సిబ్బం ది ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.