StarBucks | యూఎస్ కాఫీ చైన్ స్టార్బక్స్.. చైనాలో రెండు ఔట్లెట్లను మూసేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. కాలం చెల్లిన ఇంగిడ్రియంట్స్ను ఉపయోగించి పానీయాలు తయారు చేస్తున్నారని చైనా అధికారులు జరిపిన దర్యాప్తులో తేలిందని ప్రభుత్వ అనుబంధ దినపత్రిక పేర్కొంది. స్టార్బక్స్.. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్నదని ఆరోపించింది. చైనా తూర్పు సిటీ వుక్సిలోని రెండు స్టార్బక్స్ ఔట్లెట్లపై దర్యాప్తు కొనసాగుతున్నదని బీజింగ్ కేంద్రంగా పని చేస్తున్న దినపత్రిక పేర్కొంది.
దీనిపై స్టార్బక్స్ అధికార ప్రతినిధి స్పందిస్తూ స్థానిక మీడియాలో వార్తలు రావడంతో తాము తీవ్రంగా పరిగణించామని చెప్పారు. నిశిత దర్యాప్తు కోసం ఆ ఔట్లెట్లను మూసేశామని తెలిపారు. 22 ఏండ్లుగా చైనాలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా సేవలందిస్తున్నామన్నారు. తమ సేవలపై ప్రజలు, మీడియా పర్యవేక్షణను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.