న్యూయార్క్: బాల్యంలో ప్రేమ, కరుణ, అవగాహన, ఏకాగ్రత వంటి గుణాలు సహజంగానే ఉంటాయని, ఆ స్థితిలో కొనసాగకుండా అడ్డుకునే పరిస్థితులను వదిలిపెట్టడమే ధ్యానం అని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవి శంకర్ చెప్పారు. “మీరు ధ్యానం చేయలేరు. మీలో ధ్యానాన్ని సహజంగా జరగనివ్వాలి” అని ఆయన తెలిపారు.
ధ్యానం పేరుతో మనం చాలా ఊహలు చేస్తుంటామని, దానివల్ల మరింత శ్రమ వస్తుందని చెప్పారు. ఊహించమని సలహా ఇస్తూ ఉంటారని, అయితే ఊహించడం ధ్యానం కాదని స్పష్టం చేశారు. దృష్టిని లోపలికి తీసుకురావడం సరైనదని, ఉద్రిక్తత లేకుండా దానిని వదిలేయడమే అసలైన రహస్యమని పేర్కొన్నారు. ధ్యానం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయని, వాటి లక్ష్యం ఒకటేనని చెప్పారు. ఆదివారం ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
న్యూయార్క్ నగరంలోని ఐక్య రాజ్య సమితి ట్రస్టీ షిప్ కౌన్సిల్లో జరిగిన ధ్యాన దినోత్సవ వేడుకల్లో దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 150 దేశాలకు చెందిన 1.21 కోట్ల మంది ధ్యానం చేశారు. గ్యాలప్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలు కలిసి, ధ్యానం, శ్రేయస్సు మధ్య సంబంధంపై అధ్యయనం నిర్వహిస్తున్నాయి. దీని ఫలితాలు 2026లో వెలువడతాయి.