కొలంబో : ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడుతున్నది. అప్పుల ఊభిలో చిక్కుకున్న లంకను గట్టెకించేందుకు అధ్యక్షుడు గోటబయ రాజపక్స చర్యలకు ఉపక్రమించారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై సలహాలు, సూచనల కోసం ఆర్థిక నిపుణులతో ప్రత్యేక సలహా బృందాన్ని నియమించారు. ఈ బృందంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక మాజీ గవర్నర్ ఇంద్రజిత్ కుమారస్వామి, ప్రపంచ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్ శాంత దేవరాజన్‌తో పాటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) కెపాసిటీ డెవలప్మెంట్లో పని చేసిన మరొకరిని సైతం నియమించినట్లు ప్రెసిడెంట్ మీడియా విభాగం మాజీ డైరెక్టర్ షర్మిని కోర్ తెలిపారు. ఐఎంఎఫ్‌తో సంప్రదింపులు కొనసాగించేందుకు సలహా బృందం ఇప్పటికే అధ్యక్షుడితో చర్చించినట్లు తెలుస్తున్నది. ఐఎంఎఫ్‌తో చర్చల్లో పాల్గొన్న శ్రీలంక అధికారులతో చర్చలు జరుపడం, ప్రస్తుత రుణ సంక్షోభాన్ని అధిగమించడంపై మార్గదర్శకత్వం చేసే బాధ్యతలను అధ్యక్షుడు బృందానికి అప్పగించారు.
ఆర్థిక సంక్షోభం మధ్య మంత్రివర్గం ఇటీవల మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మహింద రాజపక్స మాత్రం రాజీనామా చేయలేదు. ప్రస్తుతం లంకలో త్వరలో అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రతిపక్ష నేతలను ప్రభుత్వంలో చేర్చుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, ఈ ప్రతిపాదనను ప్రతిపక్ష నేతలు తిరస్కరించాయి. ఆ తర్వాత ఆర్థిక మంత్రితో సహా పలువురు నలుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆర్థిక మంత్రి బాధ్యతలను అలీ సబ్రీకి అప్పగించగా.. ఆయన కేవలం 24 గంటల్లోనే పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడికి రాసిన లేఖలో తాత్కాలిక చర్యగా తాను పదవిని స్వీకరించినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వంలో ఆర్థికశాఖ సహా కీలకమైన పోస్టులకు సంబంధించిన మంత్రితో పాటు, పలు కీలక పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. ఇందులో దేశ ఆర్థిక వ్యవస్థకు బాధ్యత వహించే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్, ట్రెజరీ సెక్రెటరీ తదితర ముఖ్యమైన పోస్టులున్నాయి. ఇదిలా ఉంటే, బుధవారం వరకు దేశ కొత్త ఆర్థిక మంత్రిగా బందుల గున్బర్ధన పేరు చర్చలో ఉందని, అయితే ఆయన సైతం పదవీ బాధ్యతలను భుజలాకెత్తుకునేందుకు సిద్ధంగా లేరని తెలుస్తున్నది. ఆయనే కాదు ముఖ్యమైన పోస్టులను చేపట్టేందుకు ఎవరూ సంసిద్ధత చూపడం లేదు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అనంతరం దారుణ పరిస్థితులున్నాయి. ఈ క్రమంలో అమెరికా లెవల్-3 అడ్వైజరీని జారీ చేసింది. ప్రస్తుతానికి శ్రీలంకకు వెళ్లొద్దని సూచించింది. ప్రస్తుతం పొరుగుదేశమైన శ్రీలంకకు భారత్ ప్రస్తుతం సహాయాన్ని అందిస్తున్నది. గత 24 గంటల్లో శ్రీలంకకు 26వేల టన్నుల పెట్నోల్, 40వేల టన్నుల డీజిల్‌ను సరఫరా చేసినట్లు కొలంబోలోని భారత హైకమిషన్ బుధవారం తెలిపింది. క్రెడిట్ లైన్ కింద వివిధ ఇంధనాలు మొత్తం 2.70లక్షల మెట్రిక్ టన్నులకు పెంచనున్నట్లు హైకమిషన్ పేర్కొంది.
చైనా, జపాన్, భారత్, అంతర్జాతీయ ద్రవ్యనిధికి విదేశీ మారకద్రవ్య నిల్వలు లేకపోవడంతో అప్పుల వాయిదా కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. శ్రీలంక 45 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3 లక్షల42 వేల కోట్లు) అప్పుల్లో కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో లంక ప్రభుత్వానికి సవాల్ ఎదురవుతున్నది. ఓ వైపు ఇతర దేశాల అప్పులు తీరుస్తూనే.. దేశ ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. కరోనా మహమ్మారి మొదలైన నాటి నుంచి దేశంలో 5లక్షల మంది ప్రజలు పేదరికంలో చిక్కుకున్నారని గత సంవత్సరం ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇంతకు ముందున్న సంపన్న కుటుంబాలు సైతం ప్రస్తుతం తిండికి ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది.
దేశంలో వంటగ్యాస్, విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్నది. దేశంలో 10 గంటలకుపైగా విద్యుత్ కోత ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ద్రవ్యోల్బణం ఆసియాలో శ్రీలంకలో అత్యధికంగా ఉంది. బ్రెడ్ ప్యాకెట్ కోసం జనం రూ.150 చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. ప్రస్తుతం కప్పు టీ కోసం రూ.100 వెచ్చించాల్సిన దుస్థితి. మరో వైపు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ మిర్చి ధర 287 శాతం పెరిగి రూ.710కి చేరింది. వంకాయల ధర 51శాతం, ఉల్లి ధర 40శాతం పెరగ్గా.. కిలో బంగాళదుంపల కోసం రూ.200 వెచ్చించాల్సి వస్తున్నది.