సియోల్: దక్షిణకొరియా(South Korea) మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సతీమణి, మాజీ ఫస్ట్ లేడీ కిమ్ కియోన్ హీని అరెస్టు చేశారు. స్టాక్ మార్కెట్లో అవకతవకలు, మోసాలకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. మార్షియల్ చట్టం అమలు చేసిన కేసులో ఇప్పటికే మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను జైల్లో వేసిన విషయం తెలిసిందే. సియోల్‌లో సుమారు నాలుగు గంటల పాటు మాజీ ఫస్ట్ లేడీ కిమ్‌ను విచారించారు. తాను ఏ తప్పు చేయలేదని ఆమె పేర్కొన్నారు. కానీ కోర్టు మాత్రం అరెస్టు వారెంట్ జారీ చేసింది. సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కోర్టు ఆ ఆదేశాలు ఇచ్చింది.
గతంలో కూడా మాజీ దేశాధ్యక్షులను జైలుకీడ్చిన ఘటనలు దక్షిణకొరియాలో చోటుచేసుకున్నాయి. అయితే తొలి సారి మాజీ దేశాధ్యక్షుడితో పాటు ఫస్ట్ లేడీ కూడా జైలు పాలయ్యారు. యూన్ సుక్ యోల్‌ను జనవరిలో అరెస్టు చేశారు. మార్షియల్ చట్టాన్ని అమలు చేయడంతో దేశంలో అస్థిరత ఏర్పడింది. ఆ సమయంలో ఆయన్ను పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు జరిగాయి.
యోల్ భార్య కిమ్ .. సుమారు ఆరు లక్షల డాలర్లు అక్రమంగా ఆర్జించినట్లు కోర్టు పేర్కొన్నది. డుటెసీ మోటర్స్‌కు చెందిన స్టాక్స్‌ను ఆమె రిగ్గింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దక్షిణ కొరియాలోని బీఎండబ్ల్యూ డీలర్‌గా డుటెసీ మోటర్స్ కంపెనీ వ్యవహరించింది. వాస్తవానికి కిమ్ భర్త దేశాధ్యక్ష హోదాలోకి రాకముందే ఆమె ఈ వ్యాపారం నిర్వహించినట్లు తెలుస్తోంది. యునిఫికేషన్ చర్చ్తో జరిగిన వ్యాపార భేటీలో ఆమె రెండు అత్యంత ఖరీదైన బ్యాగ్‌లు, డైమండ్ నెక్లస్‌ను తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పార్లమెంటరీ ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో జోక్యం చేసుకున్నట్లు కిమ్‌పై ఆరోపణలు ఉన్నాయి.