సియోల్: దక్షిణ కొరియా ప్రజల వయసు తగ్గింది. ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఆ దేశ ప్రజల వయసు మైనస్ అయ్యింది. సంప్రదాయ వయసు లెక్కింపు పద్ధతులకు దక్షిణ కొరియా గుడ్‌బై చెప్పింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వయసును లెక్కించడం(Age-Counting Methods) ఆ దేశం ప్రారంభించింది. దీంతో ఆ దేశ ప్రజల వ్యక్తిగత వయసు తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు.
దక్షిణ కొరియాలో రెండు రకాలుగా వయసును లెక్కిస్తుంటారు. శిశువు పుట్టిన నాడే ఒక ఏడాది పూర్తి అయినట్లు వాళ్లు గుర్తించారు. అంటే గర్భం దాల్చిన సమయం నుంచే వయసును లెక్కించడం ఒక పద్ధతి. ఇక మరో రకమైన పద్ధతిలో.. శిశువు ఎప్పుడు పుట్టినా.. జనవరి ఒకటో తేదీని వాళ్లు ఒక ఏడాదిగా గుర్తిస్తారు. అంటే ఇక్కడ పుట్టిన రోజును ఆ దేశస్థులు పరిగణలోకి తీసుకోరు.
అయితే ఆ పురాతన సంప్రదాయాలకు దక్షిణ కొరియా ఫుల్స్టాప్ పెట్టింది. బుధవారం నుంచి వయసును లెక్కించే అంశంలో కొత్త విధానాన్ని అమలు చేయనున్నది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లే వయసు లెక్కింపు ఉంటుందని అధికారులు చెప్పారు. పాత విధానాలను మార్చేందుకు అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీవ్రంగా ప్రయత్నించారు. సంప్రదాయ పద్ధతుల వల్ల అనవసరమైన సామాజిక, ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు.
కొరియన్ ఏజ్ వ్యవస్థ ప్రకారం.. పుట్టిన శిశువు ఒక సంవత్సరం ఉంటుంది, ఆ తర్వాత జనవరి ఒకటో తేదీ రాగానే ఆ శిశువుకు మరో ఏడాది జతకూడుతుంది. అంటే ఒకవేళ డిసెంబర్ 31వ తేదీన బేబీ పుడితే, అప్పుడు తెల్లారితే ఆ బేబీకి రెండేళ్లు నిండినట్లు అవుతుందని కొరియా అధికారులు చెబుతున్నారు.
వయసును లెక్కించే విధానంలో మార్పు తేవాలని నలుగురిలో ముగ్గురు కొరియన్లు కోరుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన రీతిలో వయసు లెక్కింపు విధానం ఉండాలని స్థానిక హంకూక్ రీసర్చ్ సంస్థ తన సర్వే ద్వారా తేల్చింది. పురాతన పద్దతుల్లో జరుగుతున్న వయసు లెక్కింపును రద్దు చేయాలని గత డిసెంబర్లో చట్టసభ ప్రతినిధులు ఓటింగ్ కూడా నిర్వహించారు.
కొన్ని తూర్పు ఆసియా దేశాలు సంప్రదాయ పద్ధతుల్లోనే వయసును లెక్కిస్తూ ఉండేవి. అయితే కొన్ని దేశాలు ఆ పాత విధానాలను రద్దు చేశాయి. 1950లో జపాన్ అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడం ప్రారంభించింది. 1980 దశకంలో ఉత్తర కొరియా కూడా ఏజ్ కౌంటింగ్ పద్ధతిని మార్చింది.