సియోల్ : నెలరోజుల వ్యవధిలో దక్షిణ కొరియాలో మరో ప్రయాణికుల విమానం ప్రమాదానికి గురైంది. మంగళవారం రాత్రి గిమ్హే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హాంకాంగ్‌కు బయల్దేరడానికి సిద్ధమవుతున్న ఎయిర్ బస్ మంటల్లో చిక్కుకుంది. విమానంలోని 169 మంది ప్రయాణికులు, ఏడుగురు విమాన సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. స్వల్పంగా గాయపడిన ఓ ప్రయాణికుడిని దవాఖానకు తరలించినట్టు వారు చెప్పారు.
రాత్రి 10.15 గంటలకు పార్కింగ్ స్టాండ్ వద్ద విమానంలో మంటలు చెలరేగాయి. 10.30 గంటల కల్లా మంటలను ఆర్పివేసినట్టు అధికారులు తెలిపారు. 169 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది, ఓ ఇంజనీర్‌ను సురక్షితంగా బయటకు తరలించినట్టు వారు చెప్పారు. కాగా, డిసెంబర్ 29న ముయాన్ విమానాశ్రయంలో ఎయిర్ బస్ ప్రమాదానికి లోనై 179 మంది మరణించారు. దక్షిణ కొరియా చరిత్రలో అత్యంత ఘోర విమాన ప్రమాదంగా దీన్ని పరిగణిస్తున్నారు.