న్యూఢిల్లీ : గర్భధారణను గుర్తించగలిగే ఏఐ ఫీచర్‌తో స్మార్ట్‌వాచ్‌ను యాపిల్ కంపెనీ త్వరలో విడుదల చేయబోతున్నది. యాపిల్ వాచ్, ఐఫోన్ల నుంచి సేకరించిన డాటాను ఉపయోగించి ఈ కృత్రిమ మేధ (ఏఐ) ఫీచర్‌ను సృష్టించారు. ఇది గర్భధారణను 92 శాతం కచ్చితత్వంతో గుర్తించగలదు. ఈ ఫీచర్‌ను సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం సహకారంతో అభివృద్ధి చేశారు. దీనికి వేరబుల్ బిహేవియర్ మోడల్ (డబ్ల్యూబీఎం) అని పేరు పెట్టారు. ఈ ఫీచర్ ఈ వాచ్‌ను ధరించినవారి ప్రవర్తనను యాపిల్ వాచ్, ఐఫోన్ల నుంచి సేకరించి, ఉపయోగించుకుంటుంది.
ప్రవర్తన అంటే, ఆ వ్యక్తి నిర్వహించే రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం. వారాలు, నెలల పాటు నిర్వహించిన కార్యకలాపాల డటాను మెషిన్ లెర్నింగ్ ద్వారా విశ్లేషిస్తుంది. గర్భధారణ వంటి ఆరోగ్య పరిస్థితులను 92 శాతం కచ్చితత్వంతో గుర్తించవచ్చు. యాపిల్ హార్ట్ అండ్ మువ్మెంట్ స్టడీ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో 1,60,000 మందికిపైగా పాల్గొన్నారు. 430 మంది గర్భిణుల్లో 385 మంది సమాచారాన్ని ఈ ఫీచర్‌కు శిక్షణనిచ్చేందుకు ఉపయోగించారు.ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే గర్భధారణ గురించి తొలి దశలోనే ఓ అంచనాకు రావచ్చు.