వాషింగ్టన్: వీక్షకులు ఏయే కార్యక్రమాలు చూస్తున్నారో ప్రతి అర సెకండ్కు ఓ స్నాప్షాట్ తీసి, తమ మాన్యుఫ్యాక్చరర్లకు కొన్ని స్మార్ట్ టీవీలు పంపిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ దాఖలు చేసిన వ్యాజ్యంలో, శామ్సంగ్, ఎల్జీ, సోనీ, హైసెన్స్, టీసీఎల్ కంపెనీలపై ఈ ఆరోపణలు చేశారు. గందరగోళపరిచే కన్సెంట్ స్క్రీన్ల ముసుగులో ఆటోమేటెడ్ కంటెంట్ రికగ్నిషన్ను ఉపయోగించి ప్రేక్షకులు వీక్షించే కార్యక్రమాల సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు.
వినియోగదారులకు స్పష్టమైన అవగాహన కల్పించకుండా, అనుమతి పొందకుండా వారి సమాచారాన్ని సేకరించి, అమ్ముతున్నారని పేర్కొన్నారు. దీని వల్ల ఆకర్షణీయమైన డాటా బిజినెస్ పెరుగుతుండగా, సున్నితమైన ఆన్-స్క్రీన్ సమాచారం తుడిచిపెట్టుకుపోతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
స్మార్ట్ టీవీలలో ఉండే ఆటోమేటెడ్ కంటెంట్ రికగ్నిషన్ (ఏసీఆర్) టెక్నాలజీ వల్ల కార్యక్రమాల సిఫారసులు వ్యక్తిగత అభిరుచులకు తగినట్లుగా పంపించడానికి, ప్రేక్షకుల అనుభూతి పెరగడానికి వీలవుతుందని అమ్మకందారులు చెప్తున్నారు. కానీ ఇది వ్యక్తిగత గోప్యత హద్దులను అతిక్రమిస్తున్నదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఆన్-స్క్రీన్లో కనిపించే పాస్వర్డ్లు, బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్, గోప్యంగా భద్రపరచుకునే పత్రాలు వంటి వాటిని ఏసీఆర్ క్యాప్చర్ చేస్తుందని చెప్తున్నారు.