Shubhanshu Shukla | శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్రలో వాయిదాల పర్వ కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం ఈ నెల 22న యాక్సియం-4 మిషన్‌ను (Axiom Mission 4) చేపడతామని నాసా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రయోగాన్ని మరోసారి వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు చేపడతామనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని నాసా వెల్లడించింది. నాసాతో కలిసి ఇస్రో చేపడుతున్న ఈ ప్రయోగం షెడ్యూల్ ప్రకారం మే 29న జరగాల్సి ఉన్నది. అయితే వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నది.
అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. దీనిద్వారా భారత్, పోలండ్, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (International Space Station) పంపుతున్నారు. ఈ మిషన్‌కు భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా పైలట్‌గా వ్యవహరించబోతున్నారు.
అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ యాక్సియం (Axiom Space) చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్-4’ మిషన్ (Ax 4 mission)లో భాగంగా స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ (SpaceX Falcon 9 rocket) ద్వారా వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. దీంతో ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాన్షు చరిత్రకెక్కనున్నారు. ఇప్పటికే భారత్‌కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రష్యా సహకారంతో అంతరిక్షయానం చేశారు. రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకోనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. పైలట్‌గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని శుక్లా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, సాంకేతిక కారణాలతో యాక్సియం-4 ప్రయోగం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. నిజానికి మే 29నే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా వాయిదా పడింది. తొలుత ఈ ప్రయోగాన్ని జూన్ 8వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్ 10, జూన్ 11కు వాయిదా పడింది. యాక్సియం-4 మిషన్‌కు సంబంధించిన ఫాల్కన్-9 రాకెట్ తనిఖీల్లో ద్రవరూప ఆక్సిజన్ లీకేజ్ కారణంగా జూన్ 11న జరగాల్సిన ఈ ప్రయోగం మళ్లీ వాయిదా వేశారు. లీకేజ్‌కు సంబంధించిన మరమ్మత్తులు పూర్తిచేసేందుకు మరింత సమయం పడుతుందని, రాకెట్ లాంచింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు స్పేస్ఎక్స్ తెలిపింది. ఆ తర్వాత ప్రయోగాన్ని జూన్ 19 , అనంతరం ఈ నెల 22న చేపట్టున్నట్లు ఇస్రో ప్రకటించినప్పటికీ అది ఇప్పుడు మళ్లీ వాయిదా పడింది.