న్యూఢిల్లీ : కెనడాలోని వాంకోవర్‌లో ఉన్న ఓ ఫుడ్ బ్యాంక్ అంతర్జాతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. కళాశాలల్లో మొదటి సంవత్సరం చదువుతున్న విదేశీ విద్యార్థులకు ఉచిత ఆహారాన్ని అందించరాదని ది గ్రేటర్ వాంకోవర్ ఫుడ్ బ్యాంక్ నిర్ణయించింది. ఆహారం ధరలు, నిరుద్యోగం పెరిగిపోతుండటంతో, ఉచిత ఆహారం కోసం వస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నదని తెలిపింది. దీంతో ఈ బ్యాంక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కెనడాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులేననే సంగతి తెలిసిందే. కెనడాలో జీవన వ్యయం రికార్డు స్థాయిలో పెరిగింది. దీంతో ప్రజలు ఉచిత ఆహారాన్ని అందించే ఫుడ్ బ్యాంకులపై ఆధారపడుతున్నారు. కెనడా ఫుడ్ బ్యాంక్స్ వార్షిక నివేదిక ప్రకారం, ఈ ఏడాది మార్చి నెలలో 20 లక్షల మందికిపైగా ఉచిత ఆహారం తీసుకున్నారు. 2019 మార్చిలో ఉచిత ఆహారం తీసుకున్నవారి సంఖ్యకు ఇది రెట్టింపు.
కమలకే ఇండియన్ అమెరికన్ల మద్దతు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారత మూలాలున్న కమలా హారిస్‌కే ఇండియన్ అమెరికన్లు జైకొడుతున్నారు. 61 శాతం మంది ఆమెకు మద్దతు పలుకుతున్నారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ట్రంప్ షేర్ కూడా పెరుగుతుండడం డెమోక్రాట్లను ఆందోళనకు గురిచేస్తున్నది. అనలిటకల్ సంస్థ యూగవ్‌తో కలిసి కార్నెగీ ఎండోమెట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ నిర్వహించిన ‘2024 ఇండియన్-అమెరికన్ ఆటిట్యూడ్స్’ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అమెరికాలోని రిజిస్టర్డ్ ఇండియన్-అమెరికన్ ఓటర్లలో 61 శాతం మంది కమలాహారిస్‌కు ఓటు వేయనున్నట్టుగా చెప్పగా, 32 శాతం మంది ట్రంప్‌కు జై కొట్టారు. కమలకు మద్దతు ఇచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ అదే సమయంలో 2020 ఎన్నికలతో పోలిస్తే ట్రంప్‌కు మద్దతు పెరుగుతున్నట్టు తేలింది. అలాగే, 67 శాతం మంది ఇండియన్-అమెరికన్ మహిళలు హారిస్ వెంట నిలవగా, 53 శాతం మంది పురుషులు హారిస్‌కు ఓటేస్తామని చెప్పారు. అమెరికాలో 5.2 మిలియన్ల మంది భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. అమెరికా వలసదారుల్లో భారతీయులు రెండోస్థానంలో ఉన్నారు. దీంతో ఇప్పుడు వీరు ఫలితాలను తారుమారు చేయగల స్థితిలో నిలిచారు.