Helicopter crash in Kenya | కెన్యాలోని(Kenya) సంబురు కౌంటీలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో(Helicopter crash) ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ మిచెల్ సెన్సి-కాంటుగి, ఆయన భార్య స్టెఫానీ హోలిహాన్ తో సహా ఒక అమెరికన్ మీడియా ఎగ్జిక్యూటివ్, నలుగురు ఇతర అమెరికన్లతో సహా మొత్తం ఏడుగురు(Seven killed) మరణించారు. లోయిసాబాలోని ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి ఇవాసో నైరో నదికి హెలికాప్టర్ విహారయాత్రకు వెళుతుండగా ఉదయం 9:13 గంటలకు ఈ ప్రమాదం సంభవించిందని కెన్యా పౌర విమానయాన అథారిటీ (KCAA) తెలిపింది.హెలికాప్టర్ ప్రమాదంలో మిచెల్ సెన్సి-కాంటుగి మరణించినట్లు ఈక్వెడార్ మాజీ అధ్యక్షుడు గిల్లెర్మో లాసో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తరపున అధ్యక్షుడి కార్యాలయం నివాళులర్పించింది. అమెరికా మీడియా కథనం ప్రకారం ఈ ప్రమాదంలో మరణించిన అమెరికన్లలో మయామి రెస్టారెంట్ యజమాని రోజర్ డువార్టే కూడా ఉన్నారు.
కాగా, కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదాలు తరుచుగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. 2026 ఫిబ్రవరిలో రిఫ్ట్ వ్యాలీలోని నంది కౌంటీలో జరిగిన ఒక హెలికాప్టర్ ప్రమాదంలో పార్లమెంట్ సభ్యునితో సహా ఆరుగురు మరణించారు. అలాగే 2024లో దేశ పశ్చిమ ప్రాంతంలో 11 మందితో ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ కూలిపోవడంతో కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. సైనిక అధిపతి జనరల్ ఫ్రాన్సిస్ ఒమోండి ఒగొల్లా మరణించారు. జూన్ 2021లో, రాజధాని నైరోబీ సమీపంలో ల్యాండింగ్ అవుతుండగా వారి హెలికాప్టర్ కూలిపోవడంతో కనీసం 10 మంది సైనికులు మరణించిన విషయం తెలిసిందే.