న్యూఢిల్లీ: స్నేహితులతో కలిసి సరదాగా పిక్నిక్కో లేక బీచ్‌కో వెళ్లి సేద తీరాలనుకున్నప్పుడు మన వెంట తెచ్చుకున్న శీతల పానీయాలు చల్లగా లేకపోతే చాలా నిరాశ కలుగుతుంది. ఫ్రిజ్ నుంచి బయటికి తీశాక ఏ కూల్ డ్రింక్ క్యాన్ అయినా బాహ్య ఉష్ణోగ్రత ప్రభావం వల్ల కొద్దిసేపటికే చల్లదనాన్ని కోల్పోతుంది. దీనికి బ్రిటిష్ ఇంజినీర్ జేమ్స్ వైస్ పరిష్కారాన్ని చూపాడు. తొలిసారి పూర్తిగా రీసైకిల్ చేయదగిన సెల్ఫ్-కూలింగ్ క్యాన్‌ను రూపొందించి సమస్యకు చెక్ పెట్టాడు.
వాణిజ్య అవసరాలకు సైతం ఉపయోగించగలిగే ఈ క్యాన్లను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నాడు. విద్యుత్తు, బ్యాటరీలు లేదా చార్జింగ్ పోర్టుల అవసరమే లేకుండా ఎప్పుడు కావాలంటే కేవలం ఒక్క మీటను నొక్కడం ద్వారా సెకన్ల వ్యవధిలో చల్లబడటం, అందులోని పానీయాన్ని చల్లబర్చడం ఈ క్యాన్ ప్రత్యేకత. దీంతో కార్ల్స్‌బర్గ్, కోకాకోలా, ఎంఅండ్ఎస్, సంటోరీ అమెరికా లాంటి ప్రఖ్యాత అంతర్జాతీయ బేవరేజ్ కంపెనీలు తమ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఈ క్యాన్లను వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి.