కీవ్: నాటో కూటమిలో చేరబోమని, ఈ విషయంలో తటస్థంగా ఉంటామని ఉక్రెయిన్ ప్రకటిస్తే చర్చలకు సిద్ధమని ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆ ప్రతిపాదనపై చర్చించేందుకు ఉక్రెయిన్ ఒప్పుకోగానే కొత్త ఎత్తు వేశారు. ఉక్రెయిన్ అధికార పగ్గాలను ఆ దేశ సైన్యం చేపట్టాలని సూచించారు. అప్పుడే శాంతి ఒప్పందానికి మార్గం సుగమం అవుతుందని కొత్త మెలిక పెట్టారు. ఈ మేరకు శుక్రవారం రష్యా భద్రతా మండలిలో ప్రసంగించారు. ‘ఉక్రెయిన్ సైనికులారా.. మీ తల్లిదండ్రులు, భార్య, పిల్లలను మానవ కవచాలుగా వాడుకోవడానికి ఆ నియో-నాజీలకు (అధ్యక్షుడు జెలెన్స్కీ, పశ్చిమ దేశాలను పరోక్షంగా ఉదహరిస్తూ) అవకాశం ఇవ్వకండి. అధికార పగ్గాలను మీ చేతుల్లోకి తీసుకోండి’ అని పిలుపునిచ్చారు. అయితే, ఉక్రెయిన్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చడానికే పుతిన్ ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.