Killer Whales: జపాన్‌లో ఇటీవల మొదలైన రికార్డు స్థాయి హిమపాతం అరుదైన ‘కిల్లర్ వేల్స్ (ఆర్కాస్)’ కు ప్రాణాంతకంగా మారింది. ఉత్తర జపాన్‌లోని హక్కైడో తీరంలో గల రౌస్ అనే ప్రదేశానికి కిలోమీటరు దూరంలో గడ్డకట్టిన నీటి మధ్య చిన్న ఖాళీ ప్రాంతంలో దాదాపు 10 కిల్లర్ వేల్స్ చిక్కుకుపోయాయి. కదలడానికి కూడా వీల్లేని స్థితిలో అవి తలలను నీటి బయటపెట్టి భారంగా శ్వాస తీసుకొంటున్నాయి.
దీనికి సంబంధించిన దృశ్యాలను జపాన్‌కు చెందిన జాతీయ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది. ఆ మూగజీవాల అవస్థ చూసి జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిల్లర్ వేల్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏటా రౌస్ వద్దకు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. కాగా, తొలుత కిల్లర్ వేల్స్ అవస్థ చూసిన కొందరు మత్స్యకారులు అధికారులను అప్రమత్తం చేశారు.
దాంతో వాటిని రక్షించడం కోసం అక్కడకు చేరుకోవడం కోస్ట్‌గార్డ్స్‌కు సవాలుగా మారింది. అక్కడి నీరు మొత్తం మందపాటి మంచు ఫలకం వలే మారిపోయింది. మంచు కరిగి ఆ ఫలకం విరిగిపోయే వరకు తాము అక్కడికి వెళ్లలేమని అధికారులు చేతులెత్తేశారు. కాగా, 2005లో కూడా ఇలానే మంచులో ఆర్కాస్ చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయాయి. ఆ ఘటన కూడా రౌస్ సమీపంలోనే చోటు చేసుకొంది.