రెగ్జావిక్, అక్టోబర్ 30: భూమిపై వాతావరణ మార్పునకు కారణమవుతున్న శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంపై ఐస్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. భూమి లోపలి శిలాద్రవంతో విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు సరికొత్త ప్రయత్నాన్ని ప్రారంభించారు. ఇందుకోసం భూమి లోపలికి దాదాపు రెండు కిలోమీటర్ల లోతుకు రెండు బోర్లు తవ్వుతున్నారు. ఒకవేళ ఈ ప్రయత్నం సఫలమైతే విద్యుత్తు ఉత్పత్తి రంగంలో ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఐస్లాండ్లో అగ్నిపర్వతాలు ఎక్కువ. భూమిలోకి బోర్లు వేసి భూతాపం ద్వారా భూఉష్ణ విద్యుత్తు(జియోథెర్మల్ ఎనర్జీ) ఉత్పత్తిలో ఈ దేశం ముందుంది. ఇది ఐస్లాండ్ దిశను మార్చింది. ఈ దేశంలోని దాదాపు 90 శాతం ఇండ్లకు ఇప్పుడు ఈ విద్యుత్తే అందుతుంది. భూఉష్ణ విద్యుత్తు కారణంగానే ఒకప్పుడు ఐరోపాలోని పేద దేశాల్లో ఒకటిగా ఉన్న ఐస్లాండ్ ఇప్పుడు ధనిక దేశంగా మారింది. భూఉష్ణ విద్యుత్తు ఉత్పత్తిని మరింత విస్తృతం చేసేందుకు గాను ఈ దేశం మాగ్మా(శిలాద్రవం)పై దృష్టి సారించింది. భూమి లోపలి ఉష్ణోగ్రతల వల్ల కరిగిన రూపంలో మాగ్మా ఉంటుంది. మాగ్మా ఉండే ప్రదేశాన్ని మాగ్మా చాంబర్ అంటారు. 2009లో దేశ విద్యుత్తు సంస్థలోని బ్జర్ని పాల్సన్ అనే ఇంజినీర్ శిలాద్రవాన్ని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేసే లక్ష్యంతో ఐస్లాండ్లోని క్రఫ్ల అనే ప్రాంతంలో మొదటిసారిగా భారీ బోరు తవ్వారు. భూమి లోపల దాదాపు 2 కిలోమీటర్ల లోతులో మాగ్మా చాంబర్ ఉందని ఈ పరిశోధనలో తేలింది.
ఇంతతక్కువ లోతులో ఇక్కడ తప్ప ఇంకెక్కడా మాగ్మా ఉండదని, అధ్యయనం కోసం ఇది సరైన ప్రాంతమని శాస్త్రవేత్తలు భావించారు. ఇప్పుడు మరింత అధునాతన సాంకేతికతతో 6,857 అడుగుల లోతుకు బోర్లు వేస్తున్నారు. అంటే, ప్రపంచంలోని అతి పెద్ద భవనమైన బుర్జ్ ఖలీఫాకు ఇది రెండున్నర రెట్లు ఎక్కువ. 2027 నాటికి మొదటి బోర్ వేయడం పూర్తవుతుంది. బోర్వెల్ ద్వారా మాగ్మాపై అధ్యయనం కోసం కొన్ని సెన్సార్లను పంపించడంతో పాటు మాగ్మా నమూనాలను సేకరిస్తారు. ఆ తర్వాత 2029లో పూర్తయ్యే ప్రణాళికతో రెండో బోర్ వేయనున్నారు. మాగ్మాలో దాదాపు వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ వేడి ఆవిరిని భూఉష్ణ శక్తిగా మార్చి విద్యుత్తును ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
సాధారణ జియోథర్మల్ విద్యుత్తు కంటే పది రెట్లు ఎక్కువ విద్యుత్తును శిలాద్రవంతో ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 30 వేల ఇండ్లకు సరిపడే జియోథర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి 18 బోర్లు అవసరమవుతాయని, మాగ్మా విద్యుత్తు కోసం అయితే రెండు బోర్లు సరిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఐస్లాండ్లో మాగ్మా విద్యుత్తు ప్రయత్నం సఫలమైతే మిగతా దేశాలూ ఈ ప్రయత్నం చేస్తాయని, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుందని తెలిపారు.