ఇప్పుడిప్పుడే హిజాబ్, బుర్కా లాంటి వివాదాల నుంచి మనం బయటపడుతున్నాం. ఈనేపథ్యంలో మరో వింత విధానం తాజాగా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అదే పిలక జడ. అవును.. అమ్మాయిలు జడను మొత్తం రబ్బరు బ్యాండ్‌తో కట్టేసి పిలకలా కిందికి వదిలేస్తారు. ఇది చాలామంది చేసేది. కొందరు జడ వేసుకునే సమయం లేక.. మరికొందరు కావాలని జడను రబ్బరు బ్యాండ్‌తో కట్టేసి పూర్తిగా కిందికి వదిలేస్తారు. ఇటువంటి విధానం.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉంది. కానీ.. ప్రస్తుతం ఓ దేశంలో మాత్రం ఇలా విద్యార్థినులు పిలక జడ వేసుకొని స్కూల్‌కు వస్తే నో అంటున్నారు. పిలక జడ వేసుకొని వస్తే స్కూల్‌కు రావద్దంటూ హుకుం జారీ చేస్తున్నారు.
అలా విద్యార్థినులు పిలక జడ వేసుకొని స్కూల్‌కు వస్తే.. అది మగ పిల్లలను రెచ్చగొట్టినట్టుగా అవుతుందట. అటువంటి హెయిర్ స్టయిల్.. మగ విద్యార్థుల్లో లేనిపోని కోరికలను కలగజేస్తుంది అంటూ జపాన్‌లోని కొన్ని స్కూళ్లు విద్యార్థినులు పిలక జడ వేసుకొని స్కూల్‌కు రావద్దంటూ ఆదేశాలు జారీ చేశాయి.
పిలక జడ వేసుకోవడం వల్ల.. విద్యార్థినుల మెడ భాగం పూర్తిగా కనబడుతుందని.. అది అబ్బాయిలను రెచ్చగొట్టడం కిందికే వస్తుందంటూ కొన్ని స్కూళ్లు వాదిస్తున్నాయి. అయితే.. జపాన్‌లో ఇలాంటి వింత విధానాలు ఇదే కొత్తేమీ కాదు. ఇదివరకు జపాన్ స్కూళ్లలో విద్యార్థినులు వేసుకొని సాక్స్, అండర్ వేర్ కలర్‌పై కూడా పలు ఆంక్షలను విధించారు. ఇలాంటి విచిత్రమైన రూల్స్.. నార్త్ కొరియాలో కూడా ఉంటాయి. లేడీస్.. స్కిన్నీ జీన్స్ వేసుకోవడం, హెయిర్ స్టయిల్‌పై కూడా అక్కడ పలు ఆంక్షలు ఉన్నాయి.