న్యూయార్క్: సర్ సల్మాన్ రష్దీ(Salman Rushdie)పై కత్తితో దాడి చేసిన నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 2022లో న్యూయార్క్లో జరిగిన ఓ కార్యక్రమంలో.. రష్దీ లెక్చర్ ఇస్తున్న సమయంలో దుండగుడు 27 ఏళ్ల హదీ మాతర్ కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా రష్దీని పొడిచాడు. తల, మెడ భాగంతో కత్తిపోట్లు దిగాయి. రష్దీ కంట్లోకి కూడా ఓ కత్తి పోటు దిగింది. దీంతో ఆయన ఆ కంటి చూపును కోల్పోయారు. ఆ హత్యాయత్నానికి చెందిన దర్యాప్తును ఫిబ్రవరిలో పూర్తి చేశారు. వెస్ట్రన్ న్యూయార్క్ కోర్టురూమ్లో నిందితుడికి జైలుశిక్షను ఖరారు చేశారు.
కత్తితో దాడి చేసిన ఘటనలో రష్దీ కాలేయం కూడా డ్యామేజ్ అయ్యింది. ఓ చేతికి నరం డ్యామేజ్ కావడంతో పక్షవాతం కూడా వచ్చింది. 35 ఏళ్ల క్రితం సల్మాన్ రష్దీ రాసిన ద సటానిక్ వర్సెస్ నవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ నవలలో మహమ్మద్ ప్రవక్తపై అతను వ్యాఖ్యలు చేశారు. దీంతో రష్దీని టార్గెట్ చేశారు. రష్దీ కపట మోసకారి అని నిందితుడు కోర్టులో పేర్కొన్నాడు.