Superyacht : అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సన్నిహితుడు, బిలియనీర్ అలెక్సీ మోర్దాషావ్ (Alexei Mordashov) కు చెందిన ఓ విలాసవంతమైన నౌక హర్మూజ్ జలసంధిని దాటినట్లు తెలుస్తోంది. హర్మూజ్‌పై అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
సుమారు 500 మిలియన్ డాలర్లకుపైగా (భారత కరెన్సీలో రూ.4,700 కోట్లు) విలువైన ఈ సూపర్ యాట్ అనే నౌక శుక్రవారం మధ్యాహ్నం దుబాయ్‌లోని మెరీనా నుంచి బయలుదేరింది. శనివారం ఉదయం హర్మూజ్ జలసంధిని దాటి ఆదివారం తెల్లవారుజామున మస్కట్‌కు చేరుకుంది. చమురు రవాణాకు హర్మూజ్ జలసంధి అత్యంత కీలకం. అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈ జలసంధి మీదుగా నౌకల రవాణా గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు అమెరికా దిగ్బంధనం కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో జలసంధిని దాటేందుకు ఈ విలాసవంతమైన నౌకకు ఎవరు అనుమతులిచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది.
కాగా దీనిపై స్పందించేందుకు మోర్దాషావ్ ప్రతినిధి నిరాకరించారు. పుతిన్ సన్నిహితుడిగా పేరున్న మోర్దాషావ్ సూపర్యాట్కు యజమాని అని అధికారికంగా ఎక్కడా లేదు. కానీ 2025 నాటి షిప్పింగ్ డేటా ప్రకారం.. ఈ నౌక ఆయన భార్య నిర్వహిస్తున్న ఓ రష్యన్ కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. కాగా ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో పుతిన్‌తో సంబంధాలున్న అనేకమంది రష్యన్లపై అమెరికా, యూరప్ ఆంక్షలు విధించాయి. ఆంక్షలకు గురైన వారిలో మోర్దాషావ్ కూడా ఉన్నారు. టైమ్స్ కథనం ప్రకారం.. సూపర్‌యాట్ ప్రపంచంలోని అతిపెద్ద యాట్‌లలో ఒకటి. ఇందులో 20 సూట్రూమ్లు, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక హెలిప్యాడ్, ఒక జలంతర్గామి ఉన్నాయి.