మాస్కో: ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఆ దేశ ప్రజలతోపాటు మీడియా సంస్థలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ప్రజల నిరసనలను రష్యా బలవంతంగా అణిచివేస్తున్నది. అలాగే ఉక్రెయిన్ యుద్ధ కవరేజీపై స్థానిక మీడియా సంస్థలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. రష్యా కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ సంస్థ రోస్కోమ్నాడ్జోర్, శనివారం పది స్థానిక మీడియా సంస్థలకు వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్లో రష్యా చేపట్టిన ప్రత్యేక సైనిక చర్యకు సంబంధించిన సంఘటనలపై తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారని ఆరోపించింది. తప్పుడు సమాచార ప్రచురణ, ప్రసారాలను నిలిపివేయడంతోపాటు పాత వాటిని తొలగించకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని లేఖల ద్వారా హెచ్చరించింది.
కాగా, రష్యా కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ హెచ్చరిక లేఖలు పంపిన జాబితాలో ప్రముఖ రేడియో స్టేషన్ ఎకో మాస్క్వీ, రష్యా ప్రభుత్వాన్ని విమర్శించే వార్తా పత్రిక నోవాయా గెజిటా వంటి సంస్థలు ఉన్నాయి. మరోవైపు నోవాయా గెజిటా వార్తా పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ డిమిత్రి మురాటోవ్కు గత ఏడాది నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది.
ఈ నెల 24న ఉక్రెయిన్పై దండయాత్రను రష్యా ప్రారంభించింది. పశ్చిమ దేశాలతో సంబంధాలు, నాటోలో చేరే ప్రయత్నాలపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ ప్రజల రక్షణ పేరుతో ఆ దేశంపై యుద్ధానికి దిగింది. పొరుగు దేశ సైన్యాన్ని నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపు రష్యా దళాలు దూసుకెళ్తున్నాయి.