కీవ్: దక్షిణ, ఉత్తర కొరియా మాదిరిగా ఉక్రెయిన్ను రెండుగా విభజించాలని రష్యా కోరుకుంటున్నదని ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆరోపించారు. దేశం ముక్కలు కాకుండా ఉండేందుకు గొరిల్లా యుద్ధ విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. కాగా, ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక ఆపరేషన్‌ను రష్యా చేపట్టి నెల రోజులు దాటింది. ఏ ఒక్క నగరాన్ని రష్యా దళాలు పూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోయాయి. అయితే తొలి దశ సైనిక ఆపరేషన్ ముగిసిందని రష్యా పేర్కొంది. ఇక తమ దృష్టంతా డాన్‌బాస్‌పైనే అని తెలిపింది. ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక ప్రాంతమే డాన్బాస్. డాన్‌బాస్‌లోని కొన్ని ప్రాంతాలు గత 8 ఏండ్లుగా వేర్పాటువాదుల నియంత్రణలో ఉన్నాయి.
మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పశ్చిమ దేశాల తీరుపై మండిపడుతున్నారు. రష్యాకు వారంతా భయపడుతున్నారని ఆరోపించారు. అందుకే తమ దేశానికి సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదని విమర్శించారు. పేరుకుపోయిన పాత క్షిపణులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. నాటోలోని ఒక్క శాతం యుద్ధ విమానాలు, ఒక్క శాతం ట్యాంకులను తమకు ఇచ్చినా రష్యా దాడిని ఎదుర్కోగలమని అన్నారు. ఉక్రెయిన్ ఇంధన, ఆహార నిల్వ కేంద్రాలను రష్యా ధ్వంసం చేస్తున్నదని ఆయన వాపోయారు.