Russia Ukraine War | కీవ్ : క్రిస్మస్ పండుగ వేళ ఉక్రెయిన్ ఇంధన వ్యవస్థ విధ్వంసమే లక్ష్యంగా రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. కీవి రిహ్, ఖార్కివ్ పట్టణాల్లోని నివాస ప్రాంతాలపై క్రూయిజ్, ఖండాంతర క్షిపణులను కురిపించింది. ఈ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. బుధవారం ఉదయం ఉక్రెయిన్పై గగనతల దాడులు జరుగుతాయని హెచ్చరించే సైరన్లు మోగాయి. వెంటనే రష్యా నల్ల సముద్రం నుంచి కాలిబర్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. తమ ఇంధన వ్యవస్థపై రష్యా పెద్దఎత్తున దాడులు మళ్లీ ప్రారంభించిందని ఉక్రెయిన్ ఇంధన శాఖ మంత్రి జర్మన్ గలుషెంకో టెలిగ్రామ్ ద్వారా తెలిపారు. సెంట్రల్ ఉక్రెయినియన్ సిటీ క్రీవీ రిహ్లెపి అపార్ట్మెంట్పై మంగళవారం బాలిస్టిక్ మిసైళ్లతో రష్యా దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మరణించగా, 15 మంది గాయపడ్డారు.
రష్యా దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. దాడులు చేయడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ క్రిస్మస్ను ఎంచుకున్నారని మండిపడ్డారు. ఇంతకన్నా అమానుషత్వం ఏముంటుందని ప్రశ్నించారు. పుతిన్ ఉద్దేశపూర్వకంగానే క్రిస్మస్ రోజును ఎంపిక చేసుకున్నారని జెలెన్స్కీ ఆరోపించారు. రష్యా 70 క్షిపణులను, 100కు పైగా అటాక్ డ్రోన్లను ప్రయోగించిందన్నారు.