మాస్కో: ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా సైనిక దళాలు ఆ దేశ రాజధాని కీవ్‌లోకి దూసుకెళ్తున్నాయి. దీంతో కీవ్ వెలుపల ఉక్రెయిన్ ఆర్మీ తన పోరాటాన్ని తీవ్రం చేసింది. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ సైన్యం పోరాటాన్ని ఆపి లొంగిపోతే చర్చలకు సిద్ధమని తెలిపారు. శుక్రవారం మాస్కోలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్ ప్రజలు, ప్రజా సంస్థలపై తాము దాడులు చేయడం లేదని చెప్పారు. ఉక్రెయిన్ను నియో-నాజీలు పరిపాలించాలని రష్యా కోరుకోవడం లేదన్నారు. పౌరుల రక్షణ కోసమే ఉక్రెయిన్‌లో సైనిక చర్య చేపట్టినట్లు తమ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారని గుర్తు చేశారు. అణచివేత నుంచి విముక్తి పొందితేనే ఉక్రేనియన్లు తమ భవిష్యత్తును స్వేచ్ఛగా నిర్ణయించుకుంటారని అన్నారు.
మరోవైపు ఉక్రెయిన్ను చుట్టుముట్టిన రష్యా దళాలు అన్నివైపుల నుంచి ఆ దేశంలోకి దూసుకొస్తున్నాయి. రష్యా దళాలు ప్రధానంగా ఈశాన్య, రాస్ట్ నుంచి రాజధాని కీవ్‌ను సమీపిస్తున్నాయని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. కాగా, కీవ్‌కు వెలుపల రష్యా దళాలతో ఉక్రెయిన్ సైనికులు పోరాడుతున్నారని అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. శత్రువు తొలి టార్గెట్ తానేనని అన్నారు. రెండో టార్గెట్ తన కుటుంబం అని చెప్పారు. రష్యా దళాలు దూసుకువస్తున్నప్పటికీ తాను కీవ్‌లోనే ఉంటానని జెలెన్స్కీ తెలిపారు. తన కుటుంబం కూడా కీవ్‌లోనే ఉందన్నారు.