కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం వెయ్యి రోజులు దాటింది. అయితే తొలిసారి రష్యా తన వద్ద ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని(ICBM) ప్రయోగించినట్లు ఇవాళ ఉక్రెయిన్ పేర్కొన్నది. గురువారం ఉదయం ఆ అటాక్ జరిగినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో తొలిసారి ఆ వెపన్ వాడారు. అయితే ఎటువంటి ఖండాంతర క్షిపణిని వాడారన్న విషయాన్ని మాత్రం ఉక్రెయిన్ స్పష్టం చేయలేదు. ఆ క్షిపణి వల్ల జరిగిన నష్టం గురించి కూడా ఉక్రెయిన్ ప్రకటించలేదు. రెండు రోజుల క్రితం బ్రిటన్ సరఫరా చేసిన లాంగ్ రేంజ్ స్టార్మ్ షాడో క్షిపణులను రష్యాపై ఉక్రెయిన్ ప్రయోగించిన నేపథ్యంలో తాజా అటాక్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అస్ట్రాకాన్ ప్రాంతం నుంచి ఐసీబీఎంతో దాడి చేసి ఉంటారని భావిస్తున్నారు. అనేక రకాల మిస్సైళ్లతో డిప్రోను టార్గెట్ చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఖండాంతర క్షిపణలు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. అత్యధికంగా ఆ మిస్సైళ్లు 5వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. అయితే తాజా అటాక్ సమయంలో.. ఆరు కేహెచ్-101 క్రూయిజ్ మిస్సైళ్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ పేర్కొన్నది. డిప్రో సిటీపై జరిగిన దాడిలో భారీ నష్టం సంభవించింది. పలు భవనాలు కూలిపోయాయి. అనేక మంది గాయపడ్డారు.
బ్రిటన్‌కు చెందిన రెండు స్టార్మ్ షాడో మిస్సైళ్లను కూల్చివేసినట్లు ఇవాళ రష్యా మిలిటరీ ప్రకటించింది.