Russia terrorist | యుద్ధానికి వ్యతిరేకంగా, పుతిన్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ యువతిని రష్యా ప్రభుత్వం ఉగ్రవాదిగా ముద్ర వేసింది. ఆమె పేరును ఉగ్రవాదుల జాబాతాలో చేర్చింది. విచారణ చేపట్టిన పోలీసులు ఆమెను గృహనిర్బంధంలో ఉంచారు. విచారణ పూర్తయిన తర్వాత తప్పు తేలితే ఆమెకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయని విదేశీ వ్యవహారాల నిపుణులు చెప్తున్నారు.
రష్యాలోని అర్ఖంగెల్స్క్‌కు చెందిన ఒలేస్యా క్రివ్ట్సోవా అనే 19 ఏండ్ల యువతిని అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదిగా రష్యా ప్రకటించింది. ఐసిస్, అల్‌ఖైదా, తాలిబాన్ కన్న ప్రమాదకరమైనదిగా పరిగణిస్తున్నారు. ఉక్రెయిన్‌పై దాడిని ఎదిరిస్తున్నందుకే ఈ అమ్మాయిని ఉగ్రవాదిగా ప్రకటించడం విశేషం. ఈ యువతి తన తల్లితో కలిసి అర్ఖంగెల్స్క్లో నివిసిస్తున్నది. అక్టోబర్ 8న రష్యాపై ఉక్రేనియన్ దాడి తర్వాత ఒలేస్యా సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లను పోస్ట్ చేశారు. వాస్తవానికి ఆ రోజున రష్యాను క్రిమియాతో కలిపే కెర్చ్ వంతెనను ఉక్రెయిన్ పేల్చివేసింది. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ ఈ యువతి పోస్ట్ పెట్టింది. దాంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు అప్పటి నుంచి గృహనిర్బంధంలో ఉంచారు.
నిర్బంధంలో ఉన్న ఆ యువతి కాలికి ట్రాకర్‌ను అమర్చారు. దీని ద్వారా రష్యా అధికారులు అమె ప్రతి కార్యకలాపాలపై నిఘా ఉంచారు. గృహనిర్బంధంలో ఉంచిన తర్వాత ఒలేస్యా తన కాలుపై సాలీడు పచ్చబొట్టు వేయించుకున్నది. ఈ సాలీడు శరీరం పుతిన్ ముఖం మాదిరిగా ఉన్నది. బిగ్ బ్రదర్ మిమ్మల్ని చూస్తున్నారు.. అని కూడా రాయించుకున్నది. సైన్యాన్ని అవమానించారని ఒలేస్యాపై ఆరోపణలున్నాయి. తెలియక చేసినందున మన్నించి కొంత జరిమానా విధించి వదిలేయాలని ఆమె తరఫు లాయర్లు కోరుతున్నారు. 2022 లో కూడా ఒకసారి ఆమె రష్యా సైనికులను అవమానించినట్లు అభియోగాలున్నాయి. ఒకే ఆర్టికల్ కింద పదే పదే నేరాలు చేస్తే క్రిమినల్ కేసుగా మారుతుందని న్యాయనిపుణులు చెప్తున్నారు.