వాటికన్ సిటీ: ఉక్రెయిన్‌లో రక్తం, కన్నీళ్లు ఏరులై పారుతున్నాయని పోప్ ఫ్రాన్సిస్ ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ముగించాలని రష్యాకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఆయన ఖండించారు. క్యాథలిక్ చర్చి అధిపతి అయిన పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలోని పీటర్స్ స్క్వేర్‌లో ప్రజలనుద్దేశించి ఆదివారం ప్రసంగించారు. ‘ఉక్రెయిన్‌లో రక్తం, కన్నీళ్ల నదులు ప్రవహిస్తున్నాయి. ఇది సైనిక చర్య మాత్రమే కాదు.. మరణం, విధ్వంసం, దుఃఖానికి దారితీసే యుద్ధం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, సున్నితమైన అంశాలలో సైలెంట్‌గా దౌత్యం నెరిపే చరిత్ర వాటికన్‌కు ఉన్నది. దురాక్రమణలపై పక్షపాతం వహించకుండా చర్చలు జరుపుతుందన్న నమ్మకాన్ని పెంపొందించుకుంది. ఈ నేపథ్యంలో పోప్ ఫ్రాన్సిస్ గత వారం వాటికన్ సిటీ నుంచి కాలు బయటపెట్టి రష్యా రాయబారిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎలాంటి చర్చలు జరిపారన్నది వెల్లడికాలేదు. కానీ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి పోప్ ఫ్రాన్సిన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మరోవైపు రష్యన్ చర్చి అధిపతితో రెండో సమావేశానికి పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. అలాగే మాస్కోకు వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. దీనికి ఎలాంటి ప్రోటోకాల్స్ అవసరం లేదన్నారు. అయితే ఇప్పటి వరకు సమావేశ షెడ్యూల్ ఖరారు కాలేదు.
కాగా, ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని నిలువరించేందుకు పుతిన్‌ను ప్రభావం చేయడంపై రష్యన్ చర్చి అధిపతిపై ఒత్తిడి పెరుగుతున్నది. పోలాండ్లోని చర్చి అధిపతి దీని కోసం గట్టిగా డిమాండ్ చేశారు. ‘అంతర్జాతీయ న్యాయస్థానాలతో సహా యుద్ధ నేరాలను పరిష్కరించే సమయం వస్తుంది. మానవ న్యాయాన్ని తప్పించుకున్నప్పటికీ, దైవం విధించే శిక్ష నుంచి తప్పించుకోలేరు’ అని పోలాండ్ ఆర్చ్ బిషప్ స్టానిస్లావ్ గాడెకి వ్యాఖ్యానించారు. రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి హెడ్ పాట్రియాచ్ కిరిల్‌కు ఈ మేరకు ఘాటుగా లేఖ రాశారు.