Rishi Sunak | బ్రిటన్లో ఆదివారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్ నదీమ్ జహావిని ప్రధాని రిషి సునక్ తొలగించారు. జహావి పన్ను వ్యవహారాలపై స్వతంత్ర దర్యాప్తునకు సునాక్ ఆదేశించారు. ఆయన ఇచ్చిన పన్ను నివేదికలు సరైనవి కావని విచారణలో తేలడంతో ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.
పాలక టోరీ పార్టీ చీఫ్గా ఎలాంటి పోర్ట్ఫోలియో లేకుండా మంత్రిగా ఉన్న నదీమ్ జహావి.. హిజ్ మెజెస్టి రెవిన్యూ అండ్ కస్టమ్స్ తో పెనాల్టీ సెటిల్మెంట్కు అంగీకరించినట్లు వెల్లడైన తర్వాత అతడి ఆర్థిక విషయాలపై పలు ప్రశ్నలు బయటకొచ్చాయి. మంత్రివర్గ నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించినట్లు స్పష్టమవుతున్నందున ప్రభుత్వ పదవి నుంచి తొలగిస్తున్నట్లు తెలిపే ఒక లేఖను జహావికి సునాక్ పంపించారు. గత ఏడాది జూలైలో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ నదీమ్ జహావిని బ్రిటన్ ఆర్థిక మంత్రిగా నియమించారు. లిజ్ ట్రస్ మంత్రివర్గంలో కూడా ఆయన కొనసాగారు. రిషి సునక్ ప్రధాని అయ్యాక ఆయనను కన్జర్వేటివ్ పార్టీ ఛైర్మన్గా నియమించారు.
నదీమ్ జహావీ తన పన్నుల గురించి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడని స్వతంత్ర సలహాదారు లారీ మాగ్నస్ గుర్తించారు. గత ఏడాది జూలైలో జహావి పన్ను వ్యవహారాల నివేదికలో చాలా తప్పులను విచారణ బృందం గుర్తించింది. అలాగే, జహావీ తన డిక్లరేషన్ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని బ్రిటీష్ ట్యాక్స్ అథారిటీ తీర్పునిచ్చింది. అయితే, తక్కువ పన్ను చెల్లించడం కోసం తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు చేయలేదని జహావి చెప్తున్నారు.