లండన్: యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో.. గత ఎన్నికల్లో రన్నరప్‌గా నిలిచిన రిషి సునాక్ ఇప్పుడు ముందంజలోకి వచ్చారు. కన్జర్వేటివ్ పార్టీ ఐక్యతను కాపాడటం కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని, అయినా తన పునరాగమనానికి ఇది సరైన సమయం కాదని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ప్రధాన పోటీదారు జాన్సన్ రేసు నుంచి తప్పుకోవడంతో రిషి సునాక్ ప్రధాని పదవికి కేవలం అడుగు దూరంలో నిలిచారు.
ఇక ఆయన ప్రధాని కావడానికి మరో పోటీదారు పెన్నీ మార్డౌంట్ రూపంలో కేవలం ఒక అడ్డంకి మాత్రమే మిగిలివుంది. పెన్నీ మార్డౌంట్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటల లోపు 100 మంది ఎంపీల మద్దతు కూడబెట్ట గలిగితే రిషి సునాక్ ఆమెతో పోటీపడి ప్రధానిగా గెలువాల్సి ఉంటుంది. ఒకవేళ పెన్నీ మార్డాంట్‌కు మధ్యాహ్నంలోపు 100 మంది ఎంపీల మద్దతు లభించకపోతే ఈ రోజు సాయంత్రమే రిషి సునాక్‌ను యూకే నూతన ప్రధానిగా ప్రకటించే అవకాశం ఉంది.
యూకే ప్రధాని పదవికి పోటీపడాలంటే ముందుగా పార్టీకి చెందిన 100 మంది ఎంపీల మద్దతు కావాలి. ప్రస్తుతం రిషి సునాక్‌కు 142 మంది ఎంపీల మద్దతు ఉన్నది. అంటే అవసరమైన వారికంటే 42 మంది ఎంపీల మద్దతు ఎక్కువగా ఉన్నది. బోరిస్ జాన్సన్‌కు 58 మంది ఎంపీలు మద్దతు ప్రకటించినా మిగతా వారి మద్దతు కోసం ప్రయత్నించకుండానే ఆయన వైదొలిగారు. పెన్నీ మార్డౌంట్కు ఇప్పటివరకు కేవలం 29 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉన్నది.
కాబట్టి ఈ మధ్యాహ్నం 2 గంటల లోపు ఆమె మరో 71 మంది ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంది. లేదంటే ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్లే అవుతుంది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఒక్కరే పోటీలో మిగిలి.. ఎలాంటి పోటీ లేకుండానే నేరుగా ప్రధాని పదవిని చేపట్టే అవకాశం ఉంది.