Egypt Pyramids | కైరో: ఈజిప్టులోని గిజా పిరమిడ్ల రహస్యాన్ని పరిశోధకులు ఛేదించారు. ప్రత్యేకించి, ఖాఫ్రే పిరమిడ్ భూగర్భంలో రహస్య నగరం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. రాడార్ సిగ్నళ్ల సాయంతో ఈ రహస్య నగరాన్ని కనుగొన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఇటలీ పరిశోధకులు వెల్లడించారు. భూమి నుంచి 420 మైళ్ల ఎత్తులో ఉన్న రెండు శాటిలైట్ల సాయంతో రాడార్ సిగ్నళ్లను పంపించి ఈ మేరకు అధ్యయనం చేశారు. ఆ సిగ్నళ్ల ద్వారా పిరమిడ్ కింద భారీ హ్యాలోవ్ స్ట్రక్చర్‌ను (ఖాళీ ప్రాంతం) సూచించే టోమోగ్రఫీక్ చిత్రాలను అభివృద్ధి చేశారు. 2 వేల ఫీట్ల వరకు విస్తరించి ఉన్న 8 షాఫ్ట్ లాంటి నిర్మాణాలను గుర్తించారు.
ఇవి నగరంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సూచిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. లోపల 5 గదులు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. వాటిలో ఒకటి సమాధిలాగా ఉన్నదని అంటున్నారు. అది ఫారో సమాధిగా భావిస్తున్న నిర్మాణం కావచ్చని చెబుతున్నారు. అయితే, కొంతమంది నిపుణులు ఈ అధ్యయనాన్ని కొట్టిపారేస్తున్నారు. రాడార్ సాంకేతికత ఆ స్థాయిలో ఇంకా అభివృద్ధి చెందలేదని వారు వాదిస్తున్నారు.