వాషింగ్టన్: గతంలో ‘కంట్రీస్ ఆఫ్ కన్సర్న్’ వర్గీకరణలో పేర్కొన్న 19 దేశాల నుంచి వచ్చిన పర్మనెంట్ రెసిడెంట్స్‌కు గల గ్రీన్ కార్డ్లన్నిటినీ సమగ్రంగా సమీక్షించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్)కు ఈ ఆదేశాలిచ్చారు. వాషింగ్టన్ డీసీలో ఇద్దరు నేషనల్ గార్డ్స్ సిబ్బందిపై ఆప్ఘానిస్థాన్కు చెందిన వ్యక్తి కాల్పులు జరపడాన్ని ఉగ్రవాద చర్యగా అమెరికా పేర్కొన్న నేపథ్యంలో ట్రంప్ ఈ ఆదేశాలిచ్చారు. యూఎస్సీఐఎస్ జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం, ఓ దరఖాస్తుదారు ఇమిగ్రేషన్ స్టేటస్‌ను అధికారులు మదింపు చేసేటపుడు, ఆ దరఖాస్తుదారు జన్మించిన దేశాన్ని కూడా ప్రధాన ప్రతికూల అంశంగా పరిగణించవచ్చు.
19 ‘కంట్రీస్ ఆఫ్ కన్సర్న్’ నుంచి వచ్చిన పర్మనెంట్ రెసిడెంట్స్ అందరికీ ఈ సమీక్ష వర్తిస్తుంది. వారి గ్రీన్ కార్డులను గత ప్రభుత్వాలు ఆమోదించినప్పటికీ సమీక్ష తప్పదు. ఆఫ్ఘానిస్థాన్, బర్మా, చాద్, ది రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్, బురిండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్థాన్, వెనిజువెలా దేశాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి.
ట్రంప్ తాజా ఆదేశాల ప్రభావం అమెరికాలో గ్రీన్‌కార్డ్ పొందిన భారతీయులపై ఉంటుందా? అంటే ‘ఉండదు’ అని కచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే, అమెరికా ప్రకటించిన 19 హై రిస్క్ కంట్రీస్ జాబితాలో భారతదేశం లేదు. గ్రీన్ కార్డ్‌లను అధికారికంగా పర్మనెంట్ రెసిడెన్సీ కార్డ్‌లని పిలుస్తారు.