(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అధికారిక నివాసం గణభవన్కు నిరసనకారుల లాంగ్ మార్చ్ సమీపిస్తున్న సమయంలో కూడా ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి షేక్ హసీనా విముఖంగానే ఉన్నారట. అయితే, కుమారుడి ఒత్తిడితో ఎట్టకేలకు తలొగ్గిన ఆమె చివరకు రాజీనామాకు ఒప్పుకొన్నారని సమాచారం. రాజీనామా చేశాక ప్రధాని నివాసాన్ని ఖాళీ చేయాలనుకొన్న హసీనా.. తొలుత తన వ్యక్తిగత వస్తువులు, దుస్తులు అన్నీ సర్దుకొందామనుకొన్నారట. అయితే, అప్పటికే గణభవన్కు నిరసనకారుల బృందం అతి సమీపంలోకి రావడంతో తన సూట్‌కేసును కూడా వదిలిపెట్టి హసీనా దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారట. ఈ మేరకు బంగ్లాదేశ్‌కు చెందిన ప్రోథమ్ అలో సహా మరికొన్ని స్థానిక పత్రికలు పేర్కొన్నాయి.
ఉదయం నుంచి ఆగమాగం
నిరసనకారులపై పోలీసులు జరుపుతున్న కాల్పుల్లో మరణిస్తున్న విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఆందోళనల తీవ్రత రెట్టింపైంది. దీంతో ఈ విషయాన్ని సోమవారం ఉదయం త్రివిధ దళాల ప్రధాన అధికారులు.. షేక్ హసీనా దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఆందోళనలను నియంత్రించడంలో విఫలమయ్యారంటూ హసీనా అంతర్గతంగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో.. పీఎం పదవికి రాజీనామా చేసి సైన్యానికి పాలనా పగ్గాలు అప్పగించాలంటూ ఐజీపీతో సహా అవామీ లీగ్ పార్టీ నాయకులు కూడా హసీనాకు సూచించారు. దీనికి ఆమె విముఖత వ్యక్తం చేశారు.
కుమారుడి ఒత్తిడితో..
అప్పటికే సమయం 10 గంటలు కావొస్తోంది. నిరసనకారుల లాంగ్ మార్చ్ పీఎం కార్యాలయం రూటులోకి వస్తున్నట్టు తెలుసుకొన్న సీనియర్ అధికారి ఒకరు.. పక్కగదిలో ఉన్న హసీనా సోదరి రెహానాకు పరిస్థితిని వివరించారు. ఆమె కూడా రాజీనామా చేయాలంటూ సూచించినా.. హసీనా వినలేదు. పరిస్థితి చేజారిపోతుండటంతో అమెరికాలో ఉంటున్న హసీనా కుమారుడు సజీబ్ అహ్మద్ వాజెద్ జోయ్‌ను అధికారులు రంగంలోకి దించారు. పరిస్థితిని వివరించారు. దీంతో ఫోన్లో హసీనాతో మాట్లాడిన సజీబ్.. రాజీనామాకు ఆమెను ఒప్పించారు.
45 నిమిషాల టైమ్
దేశాన్ని విడిచిపెట్టే కంటే ముందు జాతిజనులకు ప్రధానిగా తన చివరి ప్రసంగాన్ని ఇవ్వాలనుకొని రికార్డింగ్‌కు సిద్ధమయ్యారు. అయితే, గణభవన్కు నిరసనకారులు అత్యంత సమీపంగా వచ్చారన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌తో అది వీలు కాలేదు. 45 నిమిషాల్లోగా రాజీనామాకు సంబంధించిన పత్రాలు, ఇతరత్రా అధికారిక విధులను పూర్తిచేయాలని ఆర్మీ ఇచ్చిన సూచనల మేరకు వెంటనే ఆమె రాజీనామా కార్యక్రమాలను పూర్తిచేశారు.
రాష్ట్రపతి నివాసానికి.. అటు నుంచి బయటకు
గణభవన్ నుంచి రహస్య మార్గంలో బయటపడ్డ హసీనా.. రాష్ట్రపతి నిలయమైన బంగా భవన్లో తన రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం.. కట్టుదిట్టమైన భద్రత నడుమ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఢాకాలోని మిలిటరీ ఎయిర్‌బేస్‌లో సైనిక విమానాన్ని ఎక్కారు.