రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో మూడేళ్లకు మించి బతకడని రష్యాకు చెందిన ఒక రహస్య గూఢచారి చెప్పినట్లు సమాచారం. పుతిన్ కేన్సర్‌తో బాధ పడుతున్నాడని, ఈ వ్యాధి రోజురోజుకూ వేగంగా పెరిగిపోతోందని సదరు గూఢచారి చెప్పినట్లు ఒక ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది.
ఈ కథనం ప్రకారం, పుతిన్ ఆరోగ్యం గురించి రష్యా గూఢచార సంస్థ నుంచి మాజీ స్పై బోరిస్ కార్పిచ్కోవ్కు ఒక లేఖ వచ్చింది. ప్రస్తుతం అతను యూకేలో నివసిస్తున్నాడు. ఈ రిపోర్టు ప్రకారం, ఇప్పటికే పుతిన్ చూపు చాలా దెబ్బతింది. ఆయన టీవీల్లో కనిపిస్తున్నప్పటికీ తను చెప్పాలనుకునే మాటలను పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లపై రాసివ్వాల్సి వస్తోంది.
ఒక్కోపేజీలో మూడు, లేదా నాలుగు వాక్యాల కన్నా ఎక్కువ రాస్తే.. పుతిన్ చదవలేకపోతున్నాడు. అలాగే ఇటీవలి కాలంలో పుతిన్ చేతులు విపరీతంగా వణకడం మొదలయ్యాయి. ఈ ఏడాది అక్టోబరులో 70వ పుట్టినరోజు జరుపుకోనున్న పుతిన్.. మరో మూడేళ్లకు మించి బతకడని వైద్య నిపుణులు తేల్చినట్లు సమాచారం.
అంతేకాదు, కొన్ని రోజుల క్రితం పుతిన్ కడుపులోకి కొన్ని ద్రవాలను తొలగించేందుకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవాలూ లేవని రష్యా విదేశాంగ శాఖ మంత్రి లావ్రోవ్ ఖండించారు. పుతిన్ దాదాపు ప్రతిరోజూ టీవీల్లో కనిపిస్తున్నారని, కావాలంటే వాటిలో ఆయన్ను చూడొచ్చని లావ్రోవ్ తేల్చిచెప్పారు. పుతిన్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని స్పష్టం చేశారు.