రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కలుసుకోబోతున్నారా? ఇద్దరూ ఓ అంగీకారానికి రానున్నారా? ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. ఇద్దరూ భేటీ అవుతున్నారని ముఖ్య సంధానకర్త మెడెన్స్కీ సంచలన విషయాన్ని బయటపెట్టారు. మొదటి ఇరు దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరుగుతుందని, ఈ భేటీ తర్వాత పుతిన్, జెలెన్స్కీ భేటీ అవుతారని ఆయన వెల్లడించారు.
మరోవైపు రష్యా, ఉక్రెయిన్ అధికారుల మధ్య ఇస్తాంబుల్లో 3 గంటలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ముగిశాయని అధికారులు ప్రకటించారు. ఉక్రెయిన్, రష్యా దేశాలకు చెందిన ప్రతినిధులు శాంతి చర్చల కోసం ఇస్తాంబుల్లో సమావేశం అయ్యారు. ఆ ప్రతినిధులను ఉద్దేశిస్తూ ఇవాళ టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ మాట్లాడాడు. జెలెన్స్కీ, పుతిన్ తనకు విలువైన మిత్రులు అని తెలిపారు. చర్చల్లో ప్రగతి సాధిస్తే, ఆ ఇద్దరు నేతలు కలుసుకుంటారని, ఆ భేటీని నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎర్డగాన్ చెప్పారు. రెండు వైపులా న్యాయపరమైన ఆందోళనలు ఉన్నాయని, కానీ చర్చల ద్వారా నిర్దిష్టమైన ఫలితాలను అందుకోవాలని ఆయన సూచించారు. రెండు దేశాల మధ్య శాంతి కుదరడం వల్ల ఎవరికీ నష్టం ఉండదన్నారు. చర్చల కోసం వచ్చిన ప్రతినిధులకు వెల్కమ్ చెప్పిన రీసెప్ తయిప్ ఎర్డగాన్.. ఈ చర్చలపై ఎంతో ఆధారపడి ఉన్నట్లు తెలిపారు.