వాషింగ్టన్: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్ని మృతికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కారణమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) అన్నారు. నావల్నీ మృతి వల్ల తీవ్ర పర్యవసానాలు తప్పవన్నారు. నావల్నీ మరణంలో ఆశ్చర్యం ఏమీ లేదని, కానీ ప్రతిపక్ష నేత మృతిచెందిన తీరు ఆగ్రహానికి లోను చేస్తోందని బైడెన్ తెలిపారు. నిజానికి నావల్నీకి ఏం జరిగిందన్న అంశంపై క్లారిటీ లేదని, కానీ పుతిన్, ఆయన అనుచరులే ఈ హత్యకు కారణం అయి ఉంటారని బైడెన్ చెప్పారు. నావల్నీ మృతి చెందిన విషయాన్ని జైలు అధికారులు ప్రకటించగానే.. వైట్‌హౌజ్‌లో బైడెన్ మీడియాతో మాట్లాడారు.
నావల్నీ మృతి పట్ల రష్యా అధికారులు తమ సొంత కథలు చెబుతుంటారని, కానీ ఎవరూ ఎటువంటి తప్పు చేయవద్దు అని, నావల్నీ మృతికి పుతినే కారణమని బైడెన్ అన్నారు. పుతిన్ ప్రభుత్వం అవినీతి, హింసను నావల్నీ ధైర్యంగా ఎదుర్కొన్నారని బైడెన్ తెలిపారు.