ఖాట్మండు: నేపాల్‌లో రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ఆ దేశ తదుపరి ప్రధానిగా పుష్పకమల్ దహల్ (ప్రచండ) మరోసారి పగ్గాలు చేపట్టబోతున్నారు. నేపాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ఇవాళ ఆరు పార్టీల సంకీర్ణం సమావేశమైంది. ఈ సమావేశంలో ఆరు పార్టీల మధ్య ప్రభుత్వం ఏర్పాటుపై ఏకాభిప్రాయం కుదిరింది. దాంతో ప్రచండ నేతృత్వంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సమావేశం అనంతరం సంకీర్ణ పార్టీల నేతలు ప్రకటించారు.
సమావేశంలో కుదిరిన ఒప్పందం ప్రకారం.. పుష్పకమల్ దహల్ మొదటి రెండున్నరేండ్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆ తర్వాత రెండున్నరేండ్లు సీపీఎన్-యూఎంఎల్ కూటమి ప్రధాని పదవి చేపట్టనుంది. అంటే మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి ప్రధాని పదవిని చేపట్టే అవకాశం ఉన్నది. సమావేశం అనంతరం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) నేత బర్షమాన్ పున్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఆరు పార్టీల సంకీర్ణం ప్రచండ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించడంతో ఆయన నేపాల్ అధ్యక్ష కార్యాలయానికి వెళ్లి అధ్యక్షురాలు విద్యాదేవి భండారీని కలిశారు. ఆరు పార్టీల సంకీర్ణం తరఫున ప్రధాని అభ్యర్థిని తానేనని, తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నానని అధ్యక్షురాలికి అర్జీ పెట్టుకున్నారు. ఆమె ఆమోదంతో ప్రచండ నేపాల్‌కు మరోసారి ప్రధాని కాబోతున్నారు.
కొత్త సంకీర్ణంలో.. సీపీఎన్-యూఎంఎల్‌కు 78 మంది, మావోయిస్ట్ సెంటర్‌కు 32 మంది, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి 20 మంది, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీకి 14 మంది, జనతా సమాజ్‌వాది పార్టీకి 12 మంది, జనమత్ పార్టీకి ఆరుగురు, నాగరిక్ ఉన్ముక్త్ పార్టీకి నలుగురు ఎంపీల బలం ఉంది. దాంతో మొత్తం ఎంపీల బలం 166గా ఉన్నది.