శాన్ జువాన్, డిసెంబర్ 31: ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలను సిద్ధమవుతున్న వేళ అమెరికా సరిహద్దుల్లోని ప్యూర్టో రికో ద్వీపమంతటా చీకట్లు అలుముకున్నాయి. దేశంలోని 14.7 లక్షల మంది వినియోగదారులలో 12 లక్షల మందికి పైగా విద్యుత్ సరఫరా లేదని ద్వీపంలో విద్యుత్ పంపిణీని పర్యవేక్షించే లూమా ఎనర్జీ అనే ప్రైవేట్ కంపెనీ వెల్లడించింది.
మంగళవారం ఉదయం నుంచి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా ఎప్పుడు పునరుద్ధరణ అవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. 2017 సెప్టెంబర్లో మరియా తుపాను తాకిడికి విద్యుత్ గ్రిడ్ కుప్పకూలడంతో ప్యూర్టో రికో తరచు విద్యుత్తు సరఫరా అంతరాయాన్ని ఎదుర్కొంటున్నది. తుఫానుకు ముందు నుంచే సరైన నిర్వహణ, పెట్టుబడి లేక విద్యుత్తు సంక్షోభాన్ని ద్వీపం ఎదుర్కొంటున్నది.