ఇస్లామాబాద్: అల్ ఖాదిర్ ట్రస్టు భూమి అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan), ఆయన భార్య బుష్రా బీబీలు దోషులుగా తేలారు. ఆ ఇద్దరికీ కోర్టు జైలుశిక్ష విధించింది. ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్లు, బుష్రా బీబీకి ఏడేళ్ల జైలుశిక్ష ఖరారైంది. అల్ ఖాదిర్ ట్రస్టులో సుమారు 190 మిలియన్ పౌండ్ల అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అడియాలా జైలులో ఏర్పాటు చేసిన కోర్టురూంలో.. జడ్జి నాసిర్ జావెద్ రాణా తీర్పును వెలువరించారు. ఇమ్రాన్, బుష్రాలపై ఫైన్ కూడా వేసింది కోర్టు. ఇమ్రాన్‌కు పది లక్షలు, బుష్రాకు అయిదు లక్షల జరిమానా విధించారు. ఒకవేళ ఆ జరిమానా కట్టకుంటే, మరో ఆర్నెళ్ల పాటు అదనంగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
2024, ఫిబ్రవరి 27వ తేదీన ఈ కేసును ఫైల్ చేశారు. యూకే నుంచి వచ్చిన రూ.50 బిలియన్లను చట్ట పరం చేసినందుకు ఇమ్రాన్‌తో పాటు బుష్రా.. ఖరీదైన భూములను బహరియా టౌన్ లిమిటెడ్ సంస్థ నుంచి లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన ఇస్లామాబాద్ అకౌంటబులిటీ కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంది. కానీ పలు మార్లు ఆ తీర్పు వాయిదా పడింది.
2023లో ఇమ్రాన్‌పై అనేక లీగల్ కేసులు ఫైల్ చేశారు. అవన్నీ రాజకీయ కక్షతో నమోదు చేసినట్లు ఇమ్రాన్ ఆరోపించారు. తోషాకానా, ఇద్దత్ కేసుల్లో ఇమ్రాన్ గత ఏడాది నిర్దోషిగా తేలాడు. కానీ కొత్తగా ఆయనపై తోషాకానా-2 కేసు బుక్కైంది.