లాస్ ఏంజిల్స్: గూగుల్ కంపెనీలో ఉద్యోగులకు ఉచితంగా భోజనం సరఫరా చేస్తారు. ఆ కంపెనీలో ఉన్న ఫ్రీ మీల్ పాలసీ చాలా పాపులర్. సిలికాన్ వ్యాలీలోని కొన్ని కంపెనీలు ఈ విషయంలో గూగుల్‌నే ఫాలో అవుతున్నాయి. ఉద్యోగులకు ఉచితంగా భోజనం కల్పించే విషయంలో కంపెనీ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నది. దీనిపై ఈసీవో సుందర్ పిచాయ్(Sundar Pichai) చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఎంప్లాయిస్‌కు ఫ్రీ మీల్స్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ ఉన్నట్లు ఆయన చెప్పారు.
గూగుల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న సమయంలో.. మిత్రులతో కలిసి కేఫ్‌లో గడిపేవాళ్లమని, ఆ సమయంలో అనేక అంశాలు చర్చించేవాళ్లమని, కొన్ని విషయాల్లో ఆసక్తి రెట్టింపు అయ్యేదని, కొన్ని సందర్భాల్లో మన సృజనాత్మక పెరుగుతుందని సుందర్ పిచాయ్ తెలిపారు. బ్లూమ్‌బర్గ్‌కు చెందిన ద డేవిడ్ రూబెన్స్టిన్ షోకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో ఈ అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
2004లో గూగుల్ ప్రోడక్ట్ మేనేజర్‌గా సుందర్ పిచాయ్ చేశారు. ఆ సమయంలో అద్భుతమైన ఐడియాలన్నీ.. కలిసికట్టుగా భోజనం చేస్తున్న టైంలోనే వచ్చేవన్నారు. భోజనం కోసం ఉద్యోగులు ఒక్క దగ్గరికి రావడం వల్ల.. ఆవిష్కరణ ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. అయితే అలా సామూహికంగా భోజనం చేయడం వల్ల వచ్చే ఖర్చు కన్నా.. లాభాలే ఎక్కువగా ఉంటాయన్నారు. ఫ్రీగా మీల్స్ ఇవ్వడాన్ని ఆర్థిక భారంగా చూడడం లేదన్నారు. క్రియేటివిటీ, కమ్యూనిటీ బిల్డింగ్‌లో దీన్ని సుదీర్ఘ కాల పెట్టుబడిగా భావిస్తున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌లో లక్షా 82 వేల మంది పనిచేస్తున్నారు. ఎంప్లాయి ఫ్రెండ్లీ విధానాల వల్ల పని ప్రదేశం ఉత్తేజభరితంగా ఉంటుందన్నారు. తమ కంపెనీకి ఇంటర్వ్యూ వచ్చిన వారిలో 90 శాతం మంది ఉద్యోగాలను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఫ్రీ మీల్స్‌తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్, రిమోట్ వర్కింగ్ ఆప్షన్లు, ఓవర్ టైం జీతం, వెల్నెస్ ప్రోగ్రామ్‌లు కంపెనీని ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.