టెల్ అవీవ్: పాలస్తీనా మిలిటెంట్ ఖైదీలు కంచుకోట లాంటి ఇజ్రాయెల్ జైలు నుంచి హాలీవుడ్ సినిమా ‘గ్రేట్ ఎస్కేప్’ తరహాలో తప్పించుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే గిల్బోవా జైలు నుంచి ఆరుగురు పాలస్తీనా మిలిటెంట్ ఖైదీలు తప్పించుకున్నారని బీబీసీ వార్తాసంస్థ తెలిపింది. తీవ్రవాద సంస్థ అల్ అక్సా మాజీ నాయకుడు కూడా వారిలో ఉన్నట్టు తెలుస్తున్నది. వారు బాత్రూం గచ్చును ఓ చెంచా సాయంతో తోడేసి సన్నని ఇరుకు సందులో నుంచి బయటకు వచ్చారు. అక్కడి నుంచి సొరంగం ద్వారా ప్రహరీ గోడ వెలుపలికి చేరుకోగలిగినట్టు బీబీసీ పేర్కొన్నది. తవ్వడానికి ఉపయోగించిన చెంచాను షషాంక్ రిడెంప్షన్ సినిమాలోలాగా జైలుగది గోడకు తగిలించిన ఓ పోస్టరు వెనుక దాచేవారని దర్యాప్తులో వెల్లడైంది.