రోమ్ : ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనికి ఒక ప్యాక్ మెలోడీ టాఫీలను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో.. నీలిరంగు బంద్‌గాలా సూట్లో ఉన్న ప్రధాని తెల్లసూట్లో ఉన్న మెలోనీకి ప్రసిద్ధ మెలోడీ క్యాండీల బ్యాగ్‌ను అందజేస్తుండగా, ఇద్దరు ప్రధానులు నవ్వుతూ కన్పించారు. కాగా, బుధవారం జరిగే దౌత్య సమావేశానికి ముందు మోదీ, మెలోనీ మంగళవారం సాయంత్రం రోమ్‌లో ఆహ్లాదంగా విహరించారు. కారు ప్రయాణం, డిన్నర్ సమావేశం, ప్రత్యేక కొలోసియం సందర్శనలో పాల్గొన్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మంగళవారం ఇటలీకి చేరిన ప్రధాని మోదీకి మెలోనీ స్వాగతం పలికారు. పర్యటనకు సంబంధించిన గ్లింప్స్‌ను ఇద్దరు నేతలు సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. రోమ్‌లోని కొలోసియం (ప్రాచీన భారీ క్రీడా ప్రాంగణం) వద్ద మోదీతో తీసుకున్న సెల్ఫీని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన మెలోనీ ‘మిత్రమా.. రోమ్కు స్వాగతం’ అని క్యాప్షన్ పెట్టారు. మోదీ, మెలోనీని కలిపి మెలోడీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
దేశంలోని సామాన్య పౌరుడు ఎదుర్కొంటున్న కఠిన ఆర్థిక వాస్తవాలను మోదీ ప్రభుత్వం విస్మరిస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘మన తలపైన ఆర్థిక తుఫాన్ ముంచుకు వస్తుంటే మోదీ మాత్రం ఇటలీలో టాఫీలు పంచుతున్నారు. రైతులు, యువత, శ్రామికులు ఆర్థిక కష్టాలతో రోదిస్తున్నారు. ప్రధాని మాత్రం నవ్వుతూ రీల్స్ చేస్తుంటే బీజేపీ సభ్యులు చప్పట్లు కొడుతున్నారు. ఇది నాటకీయ జిమ్మిక్కు’ అని విమర్శించారు.